
డునెడిన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో టీ20లో పాక్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అఫ్రిది పలు చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు.
టీ20ల్లో ఓ ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న పాక్ బౌలర్‌గా మొహమ్మద్ సమీ, ఫహీమ్ అష్రాఫ్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేశాడు. సమీ 2010లో ఆస్ట్రేలియాతో.. ఫహీమ్ 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది కూడా 4 సిక్సర్లు సమర్పించుకొని సమీ, ఫహీమ్ రికార్డును సమం చేశాడు. అఫ్రిది బౌలింగ్‌ను సీఫర్ట్ ఊచకోత కోసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
Seifert has 7 letters, so does Maximum 🤌
Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6— FanCode (@FanCode) March 18, 2025
ఒకే ఓవర్‌లో 26 పరుగులు సమర్పించుకోవడంతో అఫ్రిది మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తన టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్‌గా ఇది రికార్డుల్లోకెక్కింది. గతంలో అఫ్రిది టీ20ల్లో ఓ ఓవర్‌లో రెండు సార్లు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై) 24 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్రిది ఈ చెత్త రికార్డులు నమోదు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ కారకుడు. అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో సీఫర్ట్ శివాలెత్తిపోయి నాలుగు సిక్సర్లు బాదాడు. ఓ డబుల్ తీశాడు.
ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ మొత్తంగా 5 సిక్సర్లు, 3 బౌండరీలు బాది 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సీఫర్ట్‌కు ముందు మొహమ్మద్ అలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో న్యూజిలాండ్ మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్‌లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. సీఫర్ట్ ఔటయ్యాక కూడా చెలరేగిన అలెన్ 16 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 38 పరుగులు చేశాడు. సీఫర్ట్, అలెన్ విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ తొలి 7 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సాధించింది.
వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్‌దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ చెలరేగిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్, అలెన్ ఔటయ్యాక తడబడిన న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్‌మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) సహకారంతో న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్‌దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది.