
శ్రీలంకతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటై విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. లంకకు చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని అక్షర్ పటేల్ చేతికి ఇచ్చాడు.
పాండ్యా నమ్మకాన్ని వమ్ము చేయని అక్షర్ పటేల్ 20 ఓవర్లో 13 పరుగులకు గాను 11 పరుగులే ఇచ్చాడు. దీనికి తోడు చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. లంక బ్యాటర్లలో దాసున్ షనక 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుషాల్ మెండిస్ 28, చమిక కరుణరత్నే 23 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లు తీయగా..ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ చెరొక రెండు వికెట్లు తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో దీపక్ హుడా(41 నాటౌట్),అక్షర్ పటేల్(31 నాటౌట్) టీమిండియా ఇన్నింగ్సను నిలబెట్టారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో హసరంగా, దనుంజయ డిసిల్వా, దిల్షాన్ మధుషనక, కరుణరత్నే, తీక్షణలు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 జనవరి 5(గురువారం) పుణే వేదికగా జరగనుంది.