
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కొనసాగుతోంది. అంతేకాదు క్రికెట్ వరల్డ్ అత్యంత ఖరీదైన లీగ్ కూడా ఇదే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2008లో ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన ఈ పొట్టి లీగ్.. విజయవంతంగా పదిహేడేళ్లు పూర్తి చేసుకుంది.
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. దేశీ, విదేశీ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. ఇక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా బోర్డులు కూడా ఇప్పటికే బిగ్‌బాష్, SAT20 లీగ్‌లు నిర్వహిస్తున్నాయి.
మరోవైపు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా 2016లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) పేరిట టీ20 టోర్నీని ప్రవేశపెట్టింది. అయితే, ఆశించిన స్థాయిలో ఈ లీగ్ హిట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐపీఎల్-2025 సీజన్ ఆరంభమైపోగా.. పీఎస్‌ఎల్ తాజా ఎడిషన్ ఏప్రిల్ 11న మొదలుకానుంది.
అలా అయితే.. జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు
ఈ నేపథ్యంలో కరాచీ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా పాక్ బౌలర్, కరాచీ కింగ్స్ పేసర్ హసన్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘మా దేశ ప్రజలకు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. అభిమానులకు ఇదో భావోద్వేగం.
వారిని సంతోషరిచేందుకు మేము అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాం. క్రికెట్ ప్రేమికులు వినోదం కోరుకుంటారు. ఆటగాళ్లు ఎక్కడైతే అద్బుతంగా ఆడుతారో.. వారి కన్ను అటువైపే ఉంటుంది.
ఒకవేళ మేము గనుక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మరింత గొప్పగా ఆడితే.. ప్రేక్షకులంతా ఐపీఎల్ వదిలి మమ్మల్ని చూసేందుకు వస్తారు’’ అని హసన్ అలీ జియో న్యూస్‌తో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
టీమిండియా అభిమానులైతే.. ‘‘మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేరు. అసలు ఐపీఎల్‌తో, పీఎస్‌ఎల్‌కు పోలికే లేదు. ఏదేమైనా గొప్పగా ఆడాలన్న మీ సంకల్పం నెరవేరితే బాగుంటుంది’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
పునరాగమనమే లక్ష్యం
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై మే 25తో ముగియనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం పదిజట్లు ఉన్నాయి. మరోవైపు.. పీఎస్‌ఎల్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరుగనుంది. ఇందులో ఆరుజట్లు పాల్గొంటున్నాయి.
ఇక 30 ఏళ్ల హసన్ అలీ గతేడాది పది మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు. మరోవైపు.. అతడి జట్టు కరాచీ కింగ్స్ గతేడాది పదింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఈసారి సత్తా చాటేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న హసన్ అలీ.. జాతీయ జట్టులో పునరాగమనం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..