
ఐపీఎల్ 2025కు పోటీగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా లేదు. ఆటగాళ్ల మెరుపులు లేకుండా దాయాది లీగ్ సప్పగా సాగుతుంది. ఏప్రిల్ 11న మొదలైన పీఎఎస్‌ఎల్ 2025లో నిన్నటికి (ఏప్రిల్ 20) పది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో కేవలం ఒకే ఒక మ్యాచ్ కాస్త ఆసక్తిగా సాగింది. ఏప్రిల్ 12న జరిగిన సీజన్ మూడో మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తలో సెంచరీ (మహ్మద్ రిజ్వాన్, జేమ్స్ విన్స్) నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదొక్క మ్యాచే కాస్త ఆసక్తికరంగా సాగింది.
ఏప్రిల్ 14న జరిగిన సీజన్ ఐదో మ్యాచ్ కూడా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం పెషావర్ జల్మీ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 141 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్ మొత్తంలో ఇవే కాస్త చెప్పుకోదగ్గ ప్రదర్శనలు.
ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు పూర్తయినా కేవలం 14 హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. బౌలర్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. ఇస్లామాబాద్‌కు ఆడుతున్న విండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ (11) ఒక్కడే ఈ సీజన్‌లో సక్సెఫుల్ బౌలర్ అనిపించుకున్నాడు. కరాచీ కింగ్స్ బౌలర్ హసన్ అలీ (10) పర్వాలేదనిపించాడు.
పాకిస్తాన్‌లో ఫ్లాట్ పిచ్‌లు ఉన్నా బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. 10 మ్యాచ్‌లు పూర్తయినా చెప్పుకోదగ్గ సిక్సర్లు కానీ బౌండరీలు కానీ నమోదు కాలేదు. ఇస్లామాబాద్ ఆటగాడు ఫర్హాన్ అత్యధిక సిక్సర్లు (11), అత్యధిక బౌండరీలు (25) కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. బాబర్ 3 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది (3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సీజన్‌లో జేమ్స్ విన్స్ మినహా విదేశీ ఆటగాళ్లు ఒక్కరు కూడా స్థాయి మేరకు రాణించడం లేదు. డేవిడ్ వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు కూడా తేలిపోతున్నాడు.
కొలిన్ మున్రో, టిమ్ సీఫర్ట్, సామ్ బిల్లింగ్స్, ఫిన్ అలెన్ లాంటి విధ్వంకర వీరులు కూడా అడపాదడపా ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. భారీ హిట్టర్‌గా పేరున్న రిలీ రొస్సో తడబడుతున్నాడు. లోకల్ హీరోలు సల్మాన్ అఘా, మహ్మద్ హరీస్, ఫకర్ జమాన్, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, అబ్దుల్లా షఫీక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు.