
చిత్రవిచిత్ర ఘటనలన్నీ పాకిస్తాన్ క్రికెట్‌లోనే జరుగుతాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో భాగంగా ఓ ఆటగాడు వికెట్ తీసిన ఆనందంలో సొంత జట్టు ఆటగాడిపైనే దాడి చేశాడు (అనుకోకుండా). ఈ ఘటనలో బాధిత ఆటగాడి తలకు గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
Update: Everyone is ok 🤗
Khel Khel main 😄#HBLPSLX l #ApnaXHai l #MSvLQ pic.twitter.com/sJBcX91wai— PakistanSuperLeague (@thePSLt20) April 22, 2025
ఇంతకీ ఏం జరిగిందంటే.. పీఎస్‌ఎల్ 2025లో భాగంగా నిన్న లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ లాహోర్ ఖలందర్స్‌పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. ఖలందర్స్‌ను సుల్తాన్స్ బౌలర్ ఉబైద్ షా 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.
ఈ ఉబైద్ షానే ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో వికెట్ (సామ్ బిల్లింగ్స్) తీసిన ఆనందంలో పొరపాటున సహచరుడు ఉస్మాన్ ఖాన్ (వికెట్‌కీపర్) తలపై దాడి చేశాడు. వికెట్ తీశాక సంబరాల్లో భాగంగా ఉబైద్ షా సహచరులకు హై ఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖాన్ కూడా తన చేయి పైకి లేపాడు. అప్పటికే జోరుమీదున్న ఉబైద్.. పొరపాటు ఉస్మాన్ చేయిపై కాకుండా తలపై హై ఫై ఇచ్చాడు. ఈ ఘటనతో దిమ్మతిరిగిపోయిన ఉస్మాన్ తల పట్టుకుని నేల వాలాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు.
ఊహించని చర్యతో షాక్‌కు గురైన ఉస్మాన్ కొద్ది సేపు మైదానంలో పడిపోయాడు. ఫిజియో పరిశీలించాక ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్ మ్యాచ్‌లో కొనసాగాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కొద్ది సేపు అంతరాయం కలిగింది.
కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీ (కరాచీ కింగ్స్) బాగా రాణించిన తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్లు, హెయిర్ ట్రిమ్మర్లు బహుమతులగా ఇచ్చి నవ్వులపాలైంది.
ఈ ఏడాది పీఎస్‌ఎల్ ఐపీఎల్‌కు పోటీగా ఒకే సమయంలో జరుగుతుంది. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్పదంటూ ఢాంబికాలకు పోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇలా చేసింది. తీరా చూస్తే ఐపీఎల్ కారణంగా ఒకరిద్దరున్న పీఎస్‌ఎల్ అభిమానులు కూడా ఆ లీగ్‌ను చూడటం మానేశారు.
ఐపీఎల్‌తో పోటీ కారణంగా ఈ సీజన్‌లో పీఎస్‌ఎల్ అభిమానులు ఒక్కసారిగా తగ్గిపోయారు. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు.