
ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాకు 137 ఓవర్లలో 444 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఆటకు ఒకటిన్నరోజు మిగిలి ఉంది. అంటే ఓవర్‌కు మూడు పరుగుల చొప్పున పరుగులు చేసినా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే.. పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. ముఖ్యంగా నాలుగు, ఐదు రోజుల్లో బౌలర్లకు వరంగా మారింది.
ఈ లెక్కన చూస్తే టీమిండియా రిస్క్ చేయకపోవడం ఉత్తమం. మనోళ్లు బ్యాటింగ్ ఏంటో తొలి ఇన్నింగ్స్‌లోనే చూశాం. టాపార్డర్‌లో వచ్చిన నలుగురిలో ఏ ఒక్కరిలోనూ నిలకడ కనిపించలేదు. అటాకింగ్ గేమ్ ఆడుతారని ఊహించలేం. అటాకింగ్ గేమ్‌తో అన్ని కలిసి వచ్చి విజయం సాధిస్తే అది చరిత్రే అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసాధ్యమని చెప్పొచ్చు. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోతే అసలుకే ఎసరు వస్తుంది. దీనివల్ల టీమిండియా ఓటమి పాలయ్యే చాన్స్ ఉంది.
ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మ్యాచ్ గెలవడం కంటే డ్రా దిశగా అడుగులు వేయడం ఉత్తమం. వేగంగా ఆడడం కంటే ఓపికతో ఆడుతూ వికెట్లు కాపాడుకుంటూ డ్రాకు ప్రయత్నించడం మేలు. అయితే రిస్క్ చేసి వేగంగా ఆడితే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదంతా ఓపెనింగ్ జంట రోహిత్, శుబ్‌మన్ గిల్ ఆడడంపైనే ఉంటుంది. ఈ జంట వేగంగా ఆడి కనీసం 200 పరుగుల వరకు నిలబడితే టీమిండియాకు గెలిచే చాన్స్ ఉంటుంది.. లేని పక్షంలో కనీసం డ్రాకు అవకాశం ఉంటుంది.
ఇవన్నీ వద్దనుకుంటే డ్రాకు ప్రయత్నించడం ఉత్తమం అని చెప్పొచ్చు. కనీసం డ్రా చేసుకుంటే ఆస్ట్రేలియాతో కలిసి సంయుక్తంగా డబ్ల్యూటీసీ టైటిల్‌ను అందుకోవచ్చు. ఓడిపోతే మాత్రం టీమిండియా రెండోసారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
► ఇక టెస్టు క్రికెట్‌లో టీమిండియా 400కు పైగా లక్ష్యాన్ని ఒక సందర్భంలో మాత్రమే చేధించింది. 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 403 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 406 పరుగులు చేసి అందుకుంది.
► ఇక ఇదే ఓవల్‌లో టీమిండియా టెస్టుల్లో చేజ్ చేసిన దాఖలాలు లేవు. అయితే 1979లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 438 పరగులను చేధించే క్రమంలో 8 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసి కేవలం 9 పరుగుల వ్యవధిలో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఓవల్‌లో టీమిండియాకు ఫోర్త్ ఇన్నింగ్స్‌లో ఈ పరుగులే ఇప్పటివరకు అత్యధికం
► ఇంతకముందు ఆస్ట్రేలియా 1978లో ఒక టెస్టులో టీమిండియాకు 445 పరుగుల టార్గెట్‌ను విధించింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.