
మహిళల చదరంగంలో తనకు తిరుగులేదని చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్‌జున్ మరోసారి నిరూపించుకుంది. క్లాసికల్ ఫార్మాట్‌లో వరుసగా ఐదోసారి ఆమె విశ్వవిజేతగా నిలిచింది. చైనాకే చెందిన టాన్ జోంగితో షాంఘైలో జరిగిన ప్రపంచ చెస్ మహిళల చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో 34 ఏళ్ల జు వెన్‌జున్ 6.5–2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరి మధ్య 12 గేమ్‌లు జరగాల్సి ఉన్నా... తొమ్మిదో గేమ్‌లోనే జు వెన్‌జున్‌కు టైటిల్ ఖరారు కావడంతో మిగతా మూడు గేమ్‌లను నిర్వహించలేదు.
తొమ్మిది గేమ్‌లలో జు వెన్‌జున్ ఐదు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. విజేతగా నిలిచిన జు వెన్‌జున్‌కు 3,41,000 డాలర్లు (రూ. 2 కోట్ల 91 లక్షలు), రన్నరప్ టాన్ జోంగికి 2,27,000 డాలర్లు (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2018లో రెండుసార్లు (10 గేమ్‌ల ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్ వేర్వేరుగా) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జు వెన్‌జున్ ఆ తర్వాత 2020లో, 2023లోనూ వరల్డ్ టైటిల్‌ను సాధించింది.