
విరిగిన విద్యార్థిని భుజపుటెముక
ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రంలో ఘటన
పదో తరగతి పరీక్షలు రాస్తుండగా గిరిజన
ఎక్స్‌రేలో బహిర్గతమైన దుర్మార్గం
‘కర్ర’ పెత్తనం..
ఆత్మకూరు: పరీక్ష కేంద్రం చీఫ్ సాగించిన ‘కర్ర’ పెత్తనం ఓ గిరిజన విద్యార్థిని ఉజ్వల భవితకు ఆటంకంగా మారింది. చీఫ్ సూపరింటెండెంట్ విచక్షణ కోల్పోయి కర్రతో కొట్టడంతో విద్యార్థిని భుజపుటెముక విరిగి చివరి పరీక్ష రాయలేక సతమతమవుతోంది. ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ‘శ్రీనివాసా! ఇదెక్కడి ‘కర్ర’పెత్తనం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. ఆత్మకూరు మండలం వేపచెర్ల ఎగువతండాకు చెందిన రవినాయక్ కుమార్తె శ్రావణి స్థానిక కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లోని కేంద్రంలో ఆమె పరీక్షలు రాస్తోంది. శనివారం పరీక్ష రాస్తూ జవాబు తోచక దిక్కులు చూస్తున్న శ్రావణిని అక్కడకు చేరుకున్న ఆ కేంద్రం చీఫ్ శ్రీనివాసప్రసాద్ (ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం) కర్రతో కొట్టాడు. నొప్పి తాళలేక ఆమె విలవిల్లాడుతూ.. ‘సార్ కొట్టకండి’ అంటూ ప్రాధేయపడిన వినకుండా పదేపదే కర్రతో కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పరీక్ష ముగిసిన తర్వాత కేజీబీవీకి చేరుకున్న ఆమె జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలపడంతో ఆయన ఆదివారం వచ్చి కుమార్తెకు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. ఆ సమయంలో తాను పరీక్ష రాయనంటూ బాలిక మొండికేయడంతో మంగళవారం చివరి పరీక్ష ఒక్కటి రాయాలని తండ్రి సముదాయించడంతో సరేనని ఒప్పుకుంది. అయితే రాత్రికి నొప్పి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో సమాచారం అందుకున్న రవినాయక్ సోమవారం ఉదయం కుమార్తెను అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి పిలుచుకెళ్లాడు. అనుమానం వచ్చిన వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కుడిచేతి భుజపుటెముక విరిగినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో శ్రావణి కుడి చేతికి కట్టు కట్టి పంపించారు. చివరి పరీక్ష రాసేందుకు వీలు కాని పరిస్థితిలో ఉన్న బాలిక దుస్థితిపై ఎంఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా... 9వ తరగతి విద్యార్థిని సహాయకురాలిగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస ప్రసాద్ వారం రోజుల క్రితం కూడా కురుగుంటకు చెందిన పదో తరగతి విద్యార్థినిని కొట్టారని, మరో ఇద్దరు విద్యార్థులు అత్యవసరంగా బాత్రూమ్‌కు వెళ్లి వస్తుండగా వారిని పరీక్ష రాయనీయకుండా దాదాపు అరగంటకు పైగా తన గదిలోనే నిలబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రావణి విషయం తెలియగానే ఆత్మకూరు వాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు తప్పు చేస్తే సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా ఎముకలు విరిగేలా కర్రతో కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రంలో ఘటన
పదో తరగతి పరీక్షలు రాస్తుండగా గిరిజన
విద్యార్థినిని కర్రతో కొట్టిన కేంద్రం చీఫ్
ఎక్స్‌రేలో బహిర్గతమైన దుర్మార్గం

విరిగిన విద్యార్థిని భుజపుటెముక