నిలకడగా చింతపండు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతోంది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 1,000 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.14 వేలు పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.14,500, కనిష్టంగా రూ.4,300, సరాసరిన రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
అంధుల స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని సేవామందిరంలో ఉన్న ప్రభుత్వ బాల బాలికల అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికిగానూ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకూ ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అన్ని తరగతులకు పాఠశాలలో 150 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ప్రస్తుతం 58 మంది విద్యార్థులు ఉండగా మిగిలిన 98 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న విద్యార్థులంతా ఆయా తరగతుల్లోకి అర్హత ఆధారంగా ప్రవేశానికి అర్హులన్నారు. ముఖ్యంగా 40 శాతం అంధత్వం కలిగి వైద్యులచే ధ్రువీకరించబడిన సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే ప్రవేశానికి అర్హులని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 80088 89815, 81434 61585, 94900 71392, 94907 37661, 80081 71524 సెల్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
గోరంట్ల: స్థానిక నాల్గవ వార్డులోని సచివాయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రారంభించారు. మహిళలు కుట్టు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు గోరంట్లలోని చౌడేశ్వరీ కాలనీలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నూతన బోరుబావి తవ్వేందుకు రింగ్ ఏర్పాటు చేయగా మంత్రి సవిత అక్కడ పూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మారుతీప్రసాద్, ఎంపీడీఓ నరేంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రతే లక్ష్యం
నల్లచెరువు: పంచాయతీ అధికారులు పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి సమత పేర్కొన్నారు. మండల పరిధిలో అల్లుగుండు, నల్లచెరువు పంచాయతీల్లోని చెత్త సంపద కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో తయారయ్యే వర్మీ కంపోస్టు, విడి విడిగా సేకరించిన పలు రకాల చెత్తలను పరిశీలించారు. అలాగే మండల పరిషత్ కార్యలయంలో తనకల్లు, నల్లచెరువు పంచాయతీ కార్యదర్శులతో పరిశుభ్రత– పారిశుధ్యంపై సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్మికులు ప్రతి ఇంటికీ వెళ్లి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. పంచాయతీ అధికారులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్ట సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ అంజనప్ప, ఎంపీడీఓ రఘునాథ గుప్తా, ఈఓఆర్డీ శకుంతల, సర్పంచ్ పంచరత్నమ్మ, పంచాయతీ కార్యదర్శులు నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
నిలకడగా చింతపండు ధర
నిలకడగా చింతపండు ధర


