● ఓ అసిస్టెంట్‌కు.. మెడికల్ ఆఫీసర్లకు తగాదా ● కలెక్టర్, హెల్త్ కమిషనర్‌కు వద్దకు చేరిన పంచాయితీ ● అసిస్టెంట్‌ను తీసేయాలని మంత్రి సత్యకుమార్‌కు మెడికల్ ఆఫీసర్ల వినతి
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో వైద్యారోగ్యశాఖ పరువు బజారు పడుతోంది. జిల్లా అధికారిని ఓవర్‌టేక్ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది మంత్రిని కలవడం, డీహెచ్‌కు మెయిల్ ద్వారా సమాచారం చేరవేయండం, హెల్త్ కమిషనర్ వద్ద పంచాయితీ పెట్టడం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయాయి. అయితే పంచాయితీ ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో అధికారులు – సిబ్బంది మధ్య అనారోగ్యకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖ పంచాయితీ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అందరి నోటా చర్చకు దారి తీసింది. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లకుండా.. మెయిల్స్ ద్వారా విజయవాడకు సమాచారం చేరవేయడం కలకలం రేపింది. ఫలితంగా వైద్య – ఆరోగ్య శాఖలో పలు లోపాలు బహిర్గతం అయ్యాయి.
గొడవకు కారణం ఇదేనా?
కర్ణాటక సరిహద్దున ఉన్న కొన్ని పీహెచ్‌సీల్లో పని చేసే మెడికల్ ఆఫీసర్లు ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) పలు లొకేషన్ల నుంచి వేయడం సమస్యగా మారి కోల్డ్‌వార్‌కు దారి తీసింది. నిబంధనల ప్రకారం పనిచేసే చోట నుంచే బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంది. దీని వల్ల వారు పనిచేస్తున్న ప్రాంతంతో పాటు ఎన్నిగంటలకు విధులకు వస్తున్నారో కూడా సులువుగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే పీహెచ్‌సీ పరిధి నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ ఉంటేనే అప్రూవ్ చేస్తానని జిల్లా కేంద్రంలో ఉండే సీనియర్ అసిస్టెంట్ వాదించడాన్ని మెడికల్ ఆఫీసర్లు తప్పుబడుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఆ తర్వాత పదే పదే సమస్య ఉత్పన్నం కావడంతో రెండు నెలల క్రితం ఎఫ్‌ఆర్‌ఎస్ విధుల నుంచి సదరు సీనియర్ అసిస్టెంట్‌ను తప్పించారు. అయితే ఆ సీనియర్ అసిస్టెంట్‌ను జిల్లా నుంచి బదిలీ చేయించాలని కొత్తగా యూనియన్ ఏర్పాటు చేసిన సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గుర్తింపు లేని యూనియన్‌తో..
ఉద్యోగ సంఘాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి గుర్తింపు లేని ఓ యూనియన్‌ను ఏర్పాటు చేసుకుని.. తాము సిబ్బంది తరఫున పోరాటం చేస్తున్నామని ఆ యూనియన్ సభ్యులు చెబుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలి బాగాలేదని అంటున్నారు. ఆరు పీహెచ్‌సీల్లో ఏర్పడిన సమస్యపై ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు లీడ్ తీసుకుని.. సదరు సీనియర్ అసిస్టెంట్‌ను బదిలీ చేయించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆ సీనియర్ అసిస్టెంట్ కదలికలపై దృష్టి సారించి.. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో వాట్సాప్ స్టేటస్‌లోని విషయాలను కూడా ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్యశాఖలో సిబ్బంది మధ్య అనారోగ్య వాతావరణం ఏర్పడింది. కొరవడిన సమన్వయంతో ఉద్యోగుల మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. ఆఖరికి వీరి పంచాయితీ బెజవాడ వరకూ వెళ్లింది. తప్పు వారిదేనని ఒకరు.. కాదు ఆయనదేనని వారందరూ వాదిస్తున్నారు.
విచారణ చేస్తున్నాం
నేను వాట్సాప్‌లో నాకు ఇష్టం వచ్చినట్లు స్టేటస్ పెట్టుకుంటా. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? సమాజానికి ఇబ్బంది కలిగేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. డ్యూటీలో భాగంగా నేను చేయాల్సిన పని చేస్తున్నా. పీహెచ్‌సీలలో ఎఫ్‌ఆర్‌ఎస్‌లు మాత్రమే అనుమతించాలనే నిబంధన ఉంది. ఆ మేరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్‌లను తిరస్కరించా. ఉన్నతాధికారుల సూచన మేరకు నా డ్యూటీ నేను చేస్తున్నాను. అవతలి వాళ్ల తప్పిదాలను కప్పిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేయిస్తే తప్పొప్పులు తేలతాయి. – సీనియర్ అసిస్టెంట్, పుట్టపర్తి
ప్రభుత్వ జీతం.. ప్రైవేటు వైద్యం..
మెడికల్ ఆఫీసర్లకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడే.. సీనియర్ అసిస్టెంట్‌ను తక్షణమే బదిలీ చేయాలంటూ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు గుర్తింపు పొందని ఓ యూనియన్ తరఫున పోరాటం మొదలుపెట్టారు. వివరాలపై ఆరా తీస్తే ఆ మెడికల్ ఆఫీసర్లు అందరూ ప్రైవేటు క్లినిక్‌లకే పరిమితం అవుతున్నట్లు తెలిసింది. హిందూపురం కేంద్రంగా ప్రైవేటు వైద్య వ్యాపారం మొదలుపెట్టి.. పీహెచ్‌సీలకు డుమ్మా కొడుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో తమ అనధికారిక డ్యూటీలను బయటపెట్టిన సీనియర్ అసిస్టెంట్‌ను తీసేయాలని పట్టుబట్టినట్లు సమాచారం.
మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్ మధ్య ఉన్న సమస్య నా దృష్టికి వచ్చింది. వెంటనే ఎఫ్‌ఆర్‌ఎస్ బాధ్యతల నుంచి సీనియర్ అసిస్టెంట్‌ను తప్పించి.. ఆ పనులను వేరొకరికి అప్పగించాము. కమిషనర్‌కు మెయిల్స్ ద్వారా పంపించిన విషయంపై విచారణ చేస్తున్నాం. ఎవరు పంపించారనే విషయం తేలలేదు. అవన్నీ తప్పుడు ఫిర్యాదులు, ఫేక్ మెయిల్స్‌గా అనుమానం ఉంది. మెడికల్ ఆఫీసర్లు పీహెచ్‌సీల నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటాం. పని వేళల్లో కచ్చితంగా పీహెచ్‌సీల్లో ఉండాలి. లేదంటే అధికారికంగా సెలవులో ఉండాలి. డ్యూటీకి డుమ్మా కొట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – ఫైరోజాబేగం,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
సక్రమంగా పనిచేసినా తప్పేనా?
సక్రమంగా పనిచేసినా తప్పేనా?


