
మడకశిరలో దాహం.. దాహం
గుడిబండ: మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఏదో ఒక చోట రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గుడిబండ మండల పరిధిలోని బూదిపల్లి తండా గ్రామ ప్రజలు గురువారం రాస్తారోకో చేపట్టారు. జంబులబండ పంచాయతీ బూదిపల్లి తండాలో సుమారు 28 కుటుంబాలు నివసిస్తున్నాయి. కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో మడకశిర – అమరాపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జంబులబండ పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో చర్చించారు. తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా నియోకవర్గ వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో తాగునీటి సమస్య కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నా సమస్యను పరిష్కరించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
రోజూ ఏదో ఒక చోట
నీటి కోసం రోడ్డెక్కుతున్న జనం
పట్టించుకోని ప్రజాప్రతినిధులు,
అధికారులు