
కామారెడ్డి అర్బన్: ఈయన బుల్లె మల్లేశ్.. కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన మల్లేశ్ 67 ఏళ్ల వయసులోనూ నిత్యం తన కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. పనిలేదు.. ఏం పని చేయాలి.. అంటూ దిక్కులు చూసే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న మల్లేశ్ 18 ఏళ్ల వయసు నుంచే సైకిల్‌పై తన వ్యాపారం ప్రారంభించారు.
తన జీవన ప్రస్థానంలో ప్లాస్టిక్ వస్తువులు, ప్రెషర్‌కుక్కర్లు, స్టీల్ సామగ్రి, కుర్చీలు, రెడీమేడ్ దుస్తులు, గోడ గడియారాలు, ఇలా ఎన్నో వస్తువులు ప్రతీరోజు 10 నుంచి 30 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లి విక్రయించేవారు. ప్రస్తుతం పట్టణంలో చాయ్ అమ్ముతూ రోజు రూ.500 వరకు సంపాదిస్తున్నారు. తన సంపాదనతో దేవునిపల్లిలో 500 గజాల ప్లాటు కొని, ఇల్లు నిర్మించారు. ఇద్దరు కొడుకులు, బిడ్డ పెళ్లిళ్లు చేశాడు. తన ఆరోగ్యం బాగున్నంత వరకు టీలు అమ్ముతానన్నారు.