
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. పైన ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీనితో నాగార్జున సాగర్‌లోకి శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో 3 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది.
శ్రీశైలం నుంచి నీటి విడుదలను పెంచిన నేపథ్యంలో.. సాగర్‌కు వరద మరింత పెరిగిపోనుంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశముంది. కృష్ణా ప్రధాన పాయలో వస్తున్న వరదకుతోడు తుంగభద్రలోనూ భారీ ప్రవాహం ఉండటంతో.. ఈ వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని అధికారులు చెప్తున్నారు.
