
అప్పటివరకు ప్రతిపక్షంలో ఉండండి
తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర ఉంది
కానీ.. కాంగ్రెస్, సోనియాదే ఎక్కువ పాత్ర
అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘కేటీఆర్.. మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో మరోసారి మేము అధికారంలోకి వస్తాం. అప్పటివరకు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకు గతంలో రెండు పర్యాయాలు అధికారం ఇచ్చారు. మాకు కూడా ప్రజలు రెండు పర్యాయాలు అధికారం ఇస్తారు’అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీఆర్‌ఎస్ పాత్ర ఉందని.. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ మరింత పెద్ద పాత్ర పోషించారని చెప్పారు. అందుకే తమకు కూడా ప్రజలు రెండు పర్యాయాలు అధికారం ఇస్తారని పే ర్కొన్నారు. శాసనసభలో మంగళవారం రహదారులు, భవ నాల శాఖ పద్దుపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
మీరు వదిలేస్తే.. మేం సరిదిద్దుతున్నాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన పనులను తాము ఇప్పుడు చక్కబెడుతున్నామని వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘మీరు కొన్ని మంచి పనులు చేశారు. కొన్ని తప్పులు చేశారు. కొన్ని ప్రారంభించి వదిలేశారు. అవన్నీ మేము సరిదిద్దుకుంటూ వెళ్తున్నాం. జూన్ 2న సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం. అల్వాల్‌లో కూడా డిఫెన్స్ నుంచి భూమి తీసుకుని అక్కడ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. ఎల్‌బీ నగర్‌లో నిర్మించే టిమ్స్‌ను 24 అంతస్తుల నుంచి 14 అంతస్తులకు కుదించి వేగంగా పనులు కొనసాగుతున్నాయి. మీరు సచివాలయాన్ని అద్భుతంగా కట్టారు. అంచనా కంటే రూ.500 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. ఇప్పుడు వేలకోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది’అని తెలిపారు.
మీరు ఫామ్‌హౌస్‌కు.. మేము ఢిల్లీకి
‘మీ అధిష్ఠానం ఫామ్‌హౌస్‌లో ఉంటే.. మా పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో ఉంది. అందుకే మేము ఢిల్లీకి వెళ్తున్నాం. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మీరు విమర్శించడం మంచిది కాదు’అని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. కాగా, పనులు చేసిన తరువాత బిల్లులు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్–తాండూరు–జహీరాబాద్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కోరారు.
సంగెం బ్రిడ్జిని మంజూరు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ రామచంద్రునాయక్ కూడా మాట్లాడారు. మన్నెగూడ– అప్పా జంక్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచించారు. వికారాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన నాలుగు రోడ్లకు కూడా తుదిరూపు ఇవ్వాలని కోరారు.