ఆంధ్రలో 85 వేలు.. తెలంగాణలో 75 వేల కేసుల నమోదు | Over 3 lakh Indians died of tuberculosis in 2023 full details here | Sakshi
Sakshi News home page

TB Mukt Bharat: దేశవ్యాప్తంగా చాపకింద నీరులా క్షయ

Published Sat, Apr 12 2025 7:36 PM | Last Updated on Sat, Apr 12 2025 7:39 PM

హనుమకొండ జిల్లాలో టీబీ పరీక్షల వివరాలను ఇళ్లపై రాస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది

హనుమకొండ జిల్లాలో టీబీ పరీక్షల వివరాలను ఇళ్లపై రాస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది

మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ 

ఏటా ఆరు లక్షలకు పైగా బాధితులు

లక్షద్వీప్‌, అండమాన్‌లలో అతి తక్కువ కేసులు

ఐదేళ్లలో టీబీ నిర్మూలనకు రూ.10,032.75 కోట్ల ఖర్చు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నివేదికతో ఆందోళన

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘క్షయవ్యాధితో దేశవ్యాప్తంగా 2023లో మూడు లక్షల మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. క్షయ వ్యాధిని ముందే గుర్తిస్తే మరణాలను నివారించవచ్చు. సవాల్‌గా మారిన క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి’... (హైదరాబాద్‌ సీసీఎంబీలో జరుగుతున్న రీజినల్‌ ప్రాస్పెక్టివ్‌ అబ్జర్వేషనల్‌ రీసెర్చ్‌ ఫర్‌ టీబీ (రిపోర్టు) ఇండియా 14వ సదస్సులో పరిశోధకుల సూచనలివి.) 

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఎట్టి కృష్ణారావు. ములుగు జిల్లా వాజేడు మండలం నాగారం గ్రామం. టీబీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు.. కాగా పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. కూతురికి, మరో కొడుక్కి పెళ్లి కావలసి ఉంది. ఉన్న అరెకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులకు వెళ్లి భార్య సత్యమ్మ, కొడుకు, కూతురితో కలిసి కుటుంబాన్ని పోషిస్తోంది.  

ట్యూబర్‌ క్యులోసిస్‌ (Tuberculosis) (క్షయ వ్యాధి) మళ్లీ విస్తరిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోని అనేక మందిని కబళిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24లో దాదాపు 24.25 లక్షల మంది కొత్తగా టీబీ బారిన పడగా, 2024–25లో ఆ సంఖ్య 25,34,112కు చేరింది. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే టీబీ కేసుల్లో భారత్‌లోనే 26% ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. కాగా దేశవ్యాప్తంగా ట్యూబర్‌ క్యులోసిస్‌ (టీబీ) నిర్మూలనకు.. ప్రభుత్వం ఏటా సగటున సుమారు రూ. 2వేల కోట్ల చొప్పున.. ఐదేళ్లలో రూ.10,032.75 కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ చాపకింద నీరులా టీబీ వ్యాధి విస్తరిస్తూనే ఉంది.  

మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్‌ 
క్షయ వ్యాధి (టీబీ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. 2023–24లో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో 6,13,851 మందికి టీబీ వ్యాధి సోకగా 5,66,490 మందికి విజయవంతంగా చికిత్స చేశారు. 2024–25కు వచ్చేసరికి ఆ సంఖ్య 6,70,590లకు చేరింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 2,05,909 కేసుల నుంచి 2,14,670 కేసులతో నిలిచింది. బిహార్‌లో 2023–24లో 1,84,706 మందికి టీబీ సోకగా, 1,55,580 మందికి వైద్యసేవల ద్వారా నయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  2024–25లో ఆ రాష్ట్రంలో టీబీ సోకిన వారి సంఖ్య 2,03,853లుగా సర్వేలో తేలింది. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లోనూ వ్యాధి తీవ్రత ఉంది. లక్షద్వీప్‌లో అతితక్కువగా 2023–24లో 13,2024–25లో 14 కేసులు నమోదవగా.. లద్దాఖ్‌లో 328 నుంచి 318 కేసులకు తగ్గగా, అండమాన్‌ నికోబార్‌లో 488 కేసుల నుంచి 533కు పెరిగాయి.

డయ్యూ డామన్‌లో 822 కేసుల నుంచి 790కు తగ్గగా, గోవాలో 1,823 కేసుల నుంచి 1,973కు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2023–24లో 86,033 కేసులు నమోదు కాగా, ఆ ఏడాది 82,225 కేసులకు విజయవంతంగా చికిత్స చేయగా.. 2024–25లో 81,804 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 72,100లో 66,459 మందికి చికిత్స చేయగా, కొత్తగా 74,711 మంది టీబీ నిర్ధారణయింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 2023–24లో 24,25,550 కేసులను గుర్తించి చికిత్స అందించి 21,60,483 మందికి నయం చేయగా, 2024–25లో నిర్వహించిన సర్వే, పరీక్షల్లో 25,34,112 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్దారించి.. వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నివేదికలో వెల్లడించింది.  

క్షయవ్యాధి విస్తరిస్తుందిలా.. 
క్షయ.. మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా ద్వారా సంభవించే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడంతో పాటు ఇతర అవయవాలకు కూడా సోకుతుంది. టీబీ గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల టీబీ ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఉమ్మి వేసినప్పుడు, అవి టీబీ క్రిములను గాలిలోకి పంపుతాయి. అయితే ఈ వ్యాధి సోకితే సాధారణ లక్షణాలలో బరువు తగ్గడం, రెండోది దీర్ఘకాలిక దగ్గు, అలసటలు ఉంటాయి. ఛాతీ ఎక్స్‌–రే, ఇతర పరీక్షల ద్వారా టీబీని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గుర్తిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీబీ వ్యాధి వ్యాప్తిపై ఇంటింటి సర్వే నిర్వహించి స్ఫుటమ్‌ (కఫం) సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా గుర్తించిన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు మందులు, నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. కాగా 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుండగా, టీబీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తండ్రి మరణంతో ఇబ్బందులు 
టీబీ వ్యాధి నిర్ధారణయ్యాక.. వైద్య పరీక్షలు చేసుకుని మందులు వాడినా.. మా తండ్రి ఎట్టి కృష్ణారావు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. నాతో పాటు అమ్మ, అన్న, చెల్లి ఉన్నారు. పెద్దదిక్కుగా ఉన్న మా నాన్న మృతితో ఇబ్బందుల్లో పడ్డాం. అరెకరం భూమితో పాటు కూలి చేసుకుంటూ అమ్మ, మేము బతుకుతున్నాం. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి.  
– ఎట్టి బాలకృష్ణ, (టీబీ మృతుడుకృష్ణారావు కుమారుడు), నాగారం, ములుగు జిల్లా

విరివిగా కఫం పరీక్షలు.. చికిత్స 
ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఏటా టీబీ సోకిన వారిని గుర్తించేందుకు స్పుటమ్‌ (కఫం) పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈసారి 6,315 పరీక్షలు నిర్వహించి.. 402 మందిని జిల్లాలో గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య శిబిరాల్లో రోగులను గుర్తించి టీబీ నివారణ చికిత్స అందిస్తున్నాం. నిక్షయ్‌ పోషణ్‌ కింద చికిత్స పూర్తయ్యే వరకు నెలకు రూ.1,000 వారి ఖాతాలో జమ చేస్తున్నాం. 
– ఎ.అప్పయ్య, డీఎంహెచ్‌వో, హనుమకొండ జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement