ఎన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు కొన్నా రాయితీ | The state government has revised the electric vehicle policy | Sakshi
Sakshi News home page

ఎన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు కొన్నా రాయితీ

Published Mon, Nov 18 2024 4:58 AM | Last Updated on Mon, Nov 18 2024 4:58 AM

The state government has revised the electric vehicle policy

రిజిస్ట్రేషన్ చార్జీలు, పన్నుల చెల్లింపు ఉండదు 

ఎలక్ట్రిక్‌ వాహన విధానాన్ని సవరించిన రాష్ట్ర ప్రభుత్వం..నేటి నుంచి అమల్లోకి 

గతంలో అన్ని కేటగిరీలు కలిపి తొలి 2,25,500 వాహనాలకే వర్తింపు 

ఆ తర్వాతి వాహనాలకు అందని రాయితీ 

దీంతో వాహనాల సంఖ్యపై సీలింగ్‌ ఎత్తివేత 

సాక్షి, హైదరాబాద్‌: ఇక నుంచి కొనుగోలు చేసే ప్రతీ ఎలక్ట్రిక్‌ వాహనానికి రాయితీ వర్తించనుంది. రిజిస్ట్రేషన్  చార్జీలు, లైఫ్‌ ట్యాక్స్‌ సహా అన్ని రకాల పన్నులు చెల్లించాల్సిన పని ఉండదు. ఈ మేరకు ఎలక్ట్రిక్‌ వాహన పాలసీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. 2021లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలిసారి రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహన విధానాన్ని అమలులోకి తెచ్చింది. 

తక్కువ వాహనాలే ఉంటాయన్న ఉద్దేశంతో.. కొనుగోలు చేసే తొలి 5 వేల కార్లకు, ద్విచక్ర వాహనాల్లో తొలి 2 లక్షల వాహనాలకు.. ఇలా అన్ని కేటగిరీలు కలిపి దాదాపు 2.25 లక్షల వాహనాలకు ఆ రాయితీలను పరిమితం చేశారు. వాటిల్లో దాదాపు 1.60 లక్షల వాహనాలు భర్తీ అయ్యాయి. కార్లలో 5 వేల పరిమితి దాటి పోయింది. 

కొత్తగా కార్లు కొనేవారికి రాయితీలు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, వాహనాల సంఖ్యతో ప్రమేయం లేకుండా.. ఎన్ని వాహనాలు కొన్నా, రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రకటిస్తూ జీఓ నెం.41 జారీ చేసింది.  

అపరిమిత రాయితీ.. 
గతంలో ఉన్న రాయితీ విధానాన్ని య«థావిధిగా కొనసాగిస్తూనే, రాయితీ పొందే వాహనాల సంఖ్యపై సీలింగ్‌ ఎత్తేసింది. ఇక నుంచి ఎంతమంది, ఎన్ని వాహనాలు కొన్నా పూర్తి రాయితీ వర్తించేలా పాలసీలో మార్పులు చేసింది. 

అయితే బస్సుల వరకు వచ్చే సరికి కొన్ని పరిమితులు విధించింది. ఆర్టీసీ బస్సులు, ఉద్యోగులను ఉచితంగా తరలించేందుకు వినియోగించే ప్రైవేట్‌ కంపెనీల బస్సులకు మాత్రం పూర్తి రాయితీలు వర్తిస్తాయి. పర్మిట్‌లతో నడిచే టూరిస్టు, ట్రావెల్స్‌ బస్సులు, విద్యార్థులను తరలించే విద్యా సంస్థల బస్సులకు ఈ రాయితీలు వర్తించవని స్పష్టం చేసింది. 

2026 డిసెంబరు 31 వరకు వర్తింపు 
గత ప్రభుత్వం వాహనాల సంఖ్యపై సీలింగ్‌ విధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కాలపరిమితిని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త విధానం ఈ సంవత్సరం నవంబరు 18 నుంచి 2026 డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. గడువు తీరిన తర్వాత మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది.  

అప్పుడు రూ.473 కోట్లు.. ఇప్పుడు ఎంతో? 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం పది వేల ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. కొత్తగా కొన్న వాహనాలకు (సీలింగ్‌ లోపు ఉన్న వాహనాలు) వర్తించిన రాయితీ మొత్తం రూ.473 కోట్లు. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు భారీగా పెరిగింది. అన్ని కేటగిరీ వాహనాలు కలిపి నిత్యం 15 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిల్లో ఐదారు కార్లు ఉంటున్నాయి. 

ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాయితీ రూపంలో వాహన దారులకు కలిగే లబ్ధి విలువ భారీగానే ఉండనుంది. ఈ లెక్కన గతంతో పోలిస్తే రాయితీల మొత్తం మూడురెట్లు పెరుగుతుందని అంచనా. ప్రతి ఎలక్ట్రిక్‌ వాహనం వినియోగంతో సంవత్సరానికి రూ. లక్ష వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది (కేటగిరీ ఆధారంగా కాస్త అటూ ఇటుగా).  

ఆ వాహనదారుల సంగతేంటి..? 
గత ప్రభుత్వ విధానం ప్రకారం కొన్ని కేటగిరీల వాహనాలకు సంబంధించి సంఖ్యాపరంగా ఉన్న పరిమితి దాటిపోయింది. ఆ తర్వాత కొన్న వాహనాలకు రాయితీ రావటం లేదు. అన్నింటికి రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినందున, తమను వాటిల్లో భాగంగా పరిగణించాలంటూ యజమానులు కోరుతూ రవాణాశాఖ కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. 

కానీ, కొత్త విధానం సోమవారం నుంచి అమలులోకి వస్తున్నందున, రాయితీ ఇవ్వలేమంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించి, రాయితీ తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేలా చైతన్యం తెస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగాలని, ఈ దిశలో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. 

ఎలక్ట్రిక్‌ వాహన విధానంలో చేసిన మార్పులను ఆయన ఆదివారం  సచివాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యపై సీలింగ్‌ విధించటంతో కొత్తగా ఆ వాహనాలు కొనేవారికి రాయితీలు రావటం లేదని, అందుకే తాము వాటి సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించామ న్నారు. 

అయితే, ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసే సంస్థలు సామాజిక బా ధ్యతగా భావించి, ప్రైవేట్‌గా చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా సంస్థల బస్సులకు రాయితీ వర్తింపు విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement