ఈ ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ | Telangana Economy Is Marginal This Financial Year | Sakshi
Sakshi News home page

ఈ ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

Published Sun, Oct 2 2022 2:16 AM | Last Updated on Sun, Oct 2 2022 8:34 AM

Telangana Economy Is Marginal This Financial Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్‌బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్‌’ లెక్కలు చెబుతున్నాయి.

ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్‌లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

స్థిరంగా పన్ను ఆదాయం..
కాగ్‌ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్‌లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు.

2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. 

అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే..
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్‌బీఐ అంగీకరించలేదు.

ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్‌లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement