
సాక్షి, ఖమ్మం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మతిస్థిమితం లేని ఆయన భార్య 3 రోజుల పాటు శవంతోనే ఇంట్లో గడిపింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి భోగి వీరభద్రం (65) కొణిజర్ల మండలం శాంతినగర్‌లో ఇల్లు నిర్మించుకుని భార్యతో ఉంటున్నాడు. రోజూ తల్లిదండ్రుల యోగ క్షేమాలు కనుక్కునే పెద్దకుమారుడు వెంకటకృష్ణ ఈనెల 6వ తేదీ నుంచి ఫోన్ చేస్తున్నా తీయడం లేదు.
దీంతో ఆదివారం ఆయన ఇంటికి వచ్చేసరికి తల్లి వరండాలో కనిపించింది. తండ్రి విషయమై ఆరా తీయగా బెడ్‌రూమ్‌లో ఉన్నాడని చెప్పింది. వెంకటకృష్ణ వెళ్లి చూడగా తండ్రి వీరభద్రం మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆయన మృతి చెంది 3 రోజులు అవుతున్నట్లు గుర్తించారు. అధిక రక్తపోటుతో కింద పడడంతో తలకు తీవ్ర గాయమై మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. వెంకటకృష్ణ ఫిర్యాదుతో కేసు నమో దు చేశామని కొణిజర్ల ఎస్‌ఐ శంకరరావు తెలిపారు.