
వ్యాపారవేత్త జయరాం చౌదరి అరెస్ట్?
తిరుపతి క్రైమ్: తిరుపతికి చెందిన వ్యాపారవేత్త, మయూర హోటల్ యజమాని జయరాం చౌదరిని గురువారం రాత్రి చైన్నెలో తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జయరామచౌదరిని అరెస్టు చేసిన తర్వాత ఆయన పోలీసులతో మాట్లాడిన అంశాలతో ఓ వీడియో గురువారం అర్ధరాత్రి తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కోల్‌కతా 8 కోట్ల రూపాయల చీటింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే జయరాం చౌదరికి వారెంట్ జారీచేశారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అరెస్ట్ చేసే సమయంలో జయరాంచౌదరి కోల్‌కతా హైకోర్టులో అపీల్ దాఖలు చేశానని వారికి వివరించారు. రూ.8 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని హైకోర్టులో 18 శాతం చెల్లించామని, అంతా కోర్టు ఆదేశాల మేరకే జరిందని తెలిపారు. ఇంతలోనే రూ.500 కోట్ల ఆస్తులు అటాచ్ చేసి జడ్జి ఆదేశాలు జారీ చేశారని పోలీసులకు వివరించారు. తన భార్య అనారోగ్యంతో చైన్నెలో చికిత్స పొందుతోందని.. తనను బలవంతంగా తీసుకెళ్లాలంటే నా శవం వస్తుందని పోలీసులను బెదిరించాడు. అయితే పోలీసులు ఆయనను శుక్రవారం రాత్రి వరకు తిరుపతికి తీసుకురాలేదు. నేరుగా కోల్‌కతాకు తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే గతంలో జయరాం చౌదరి షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు రైతులను మోసం చేసి తప్పించుకుని తిరిగుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.