ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రితో పాటు బంధువులు కత్తులతో విరుచుకుపడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై అడ్డగించి విచక్షణా రహితంగా దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంతియాజ్ (21) నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఇతడికి సమీప బంధువైన బోరబండకు చెందిన సయ్యద్ అలీ కుమార్తె సయ్యద్ జైన్ ఫాతిమాతో (19) మూడేళ్ల క్రితం పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో వారు తరచూ కలుసుకునేవారు. వివాహం చేసుకోవాలని భావించిన వీరు విషయం తల్లిదండ్రులకు చెప్పారు. వీరి పెళ్లికి ఫాతిమా తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో తమ కుమార్తె కనిపించడం లేదంటూ బుధవారం తల్లిదండ్రులు ఎస్సాఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఫాతిమాను ఇంతియాజ్ తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్న ఆమె కుటుంబసభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా ఫాతిమా, ఇంతియాజ్‌లు గురువారం సదాశివపేటలోని ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు.