స్వైపింగ్’లో అదనపు రుసుం వసూలు చేయొద్దు
► రాష్ట్ర వినియోగదారుల సంఘాల రీజినల్ కార్యదర్శి సంపత్‌కుమార్
నస్పూర్: దుకాణదారులు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన మొత్తానికే స్వైపింగ్ ద్వారా డబ్బు తీసుకోవాలని అదనంగా వసూలు చేయొద్దని రాష్ట్ర వినియోగదారుల సంఘాల రీజినల్ కార్యదర్శి, సంఘమిత్ర వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి పి.సంపత్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాలలో కొందరు వ్యాపారులు డిజిటల్ బ్యాంక్ కార్డు ఉపయోగించుకొని వినియోగదారుడు కొనుగోలు చేసినప్పుడు బిల్లుపై అదనంగా కొంత రుసుము వసూళ్లు చేస్తున్నారన్నారు.
వినియోగదారుడి నుంచి అదనపు రుసుం వసూళు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. బిల్లుపై అదనంగా వసూళు చేయడాన్ని నిలిపేయాలని లేని పక్షంలో వినియోగదారుల చట్టాన్ని ఆశ్రయిస్తామన్నారు. దీనిపై కలెక్టర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి గోసిక మల్లేశ్, మంచిర్యాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కమల్, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.