
మృతదేహం తరలింపునకు అష్టకష్టాలు
● చింతూరు వద్ద అడ్డంకిగా వరద
● నాటు పడవపై తరలింపు
చింతూరు: అనారోగ్యంతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద అడ్డంకిగా ఉండడంతో పడవపై మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వీఆర్‌పురం మండలం చొప్పల్లికి చెందిన పొన్నాడ నారాయణమ్మ(47) అనారోగ్యంతో బుధవారం గుంటూరులోని ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో గురువారం ఆమె మృతదేహాన్ని చొప్పల్లి తరలించేందుకు చింతూరు తీసుకువచ్చారు. కాగా ఆ గ్రామానికి వెళ్లేందుకు మార్గమధ్యలోని జల్లివారిగూడెం, సోకిలేరు, చీకటివాగుల వరద నీరు రహదారిపై నిలిచి ఉంది. దీంతో చీకటివాగు వద్దనుంచి మృతదేహాన్ని చింతూరుకు చెందిన ఎర్రం శ్రీను మర పడవపై తరలించేందుకు సన్నాహాలు చేశారు. అదే సమయంలో పడవ ఇంజను మరమ్మతులకు గురికావడంతో పడవ యజమాని తెడ్డుసాయంతో పడవను నడుపుకుంటూ వెళ్లి మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాడు.