
‘సీలేరు’ జలాశయాలు కళకళ
సీలేరు: విద్యుత్ కాంప్లెక్స్‌లో జలాశయాలు కళకళలాడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తున్నాయి.
● బలిమెల జలాశయంలోకి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతంలో వాగులు, గెడ్డల నీటితోపాటు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నుంచి విడుదల అవుతున్న నీరు కూడా వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1500.4 అడుగుల వద్ద ఉంది. సుమారు 2400.9 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా రోజుకు 1960 క్యూసెక్కులు బయటకు వెళ్తోంది.
● డొంకరాయి, మోతుగూడెం జల విద్యుత్ కేంద్రాలకు నీరందించడంలో కీలకమైన గుంటవాడ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1360 అడుగులు కాగా ప్రస్తుతం 1353.1 అడుగులకు పెరిగింది. 2506.6 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది.
● ఫోర్‌బే డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 930 అడుగులు కాగా ప్రస్తుతానికి 921.8 అడుగులో నీరు ఉంది. రోజుకు 3483 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఒక మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
మోతుగూడెం: డొంకరాయి జలాశయ నీటిమట్టం పదిరోజులుగా ప్రమాదస్థాయిలో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1036 అడుగులకు నీరు చేరింది. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై ఆరో నంబరు గేటు ద్వారా సుమారు 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలా పుట్టు జలాశయాల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కొద్దిరోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు జలాశయాల్లోకి వచ్చి చేరుతోంది.
● డుడుమ జలాశయ నీటి మట్టం 2590 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2585.80 అడుగులుగా నమోదయింది. డుడుమ జలాశయ ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటి మట్టం సైతం క్రమేపీ పెరుగుతోంది.
● జోలాపుట్టు జలాశయ నీటి సామర్థ్యం 2750 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2748.70 అడుగులు నీటి నిల్వ ఉంది. జలాశయాల్లోకి వరదనీరు చేరుతూ ఉండడంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది నిరంతరం జలాశయ నీటి నిల్వలు అంచనా వేస్తున్నారు. డుడుమ జలాశయం ఒకటో నంబరు గేటును ఎత్తి పదివేల క్యూసెక్కులు దిగువనున్న బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయం నుంచి 8వేల క్యూసెక్కులు డుడుమ ప్రాజెక్ట్‌లోకి విడుదల అవుతోంది. రెండు జలాశయాలు ప్రమాదస్థాయి నుంచి సాధారణ స్థాయికి తీసుకువచ్చేలా ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
జోలాపుట్టు, డుడుమకు వరద తాకిడి
మేలు చేస్తున్న వర్షాలు
భారీగా చేరుతున్న వరద నీరు
దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
ప్రాజెక్ట్‌ల్లో 94.3784 టీఎంసీల నిల్వలు
విద్యుత్ ఉత్పత్తికి ఢోకా లేదంటున్న అధికారులు
7.5 మిలియన్ యూనిట్ల ఉత్పాదన
విద్యుత్ ఉత్పత్తికి పూర్తిస్థాయిలో 94.3784 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. గ్రిడ్ ఆదేశాల మేరకు మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరులో 7.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. సీలేరు బేసిన్‌లోని అన్ని జలాశయాల నీటిమట్టాలు ప్రమాదస్థాయిలో ఉన్నాయి.
– చంద్రశేఖర్ రెడ్డి, సీలేరు ఎస్‌ఈ, ఏపీ జెన్‌కో

‘సీలేరు’ జలాశయాలు కళకళ

‘సీలేరు’ జలాశయాలు కళకళ

‘సీలేరు’ జలాశయాలు కళకళ

‘సీలేరు’ జలాశయాలు కళకళ