
మోదకొండమ్మ ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభం
మాడుగుల: స్థానిక మోదకొండమ్మ ఆలయంలో గురువారం ప్రేమ విహారి సినిమా షూటింగ్ ప్రారంభించారు. మాదల ప్రొడక్షన్ నంబరు 2 పేరు మీద ప్రారంభించిన సినిమా తొలి షాట్‌కు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనాధు శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. చిత్రం వివరాలను యూనిట్ సభ్యులు స్థానిక విలేకరులకు తెలిపారు. పూర్తి ప్రేమకథా చిత్రమైన ఈ సినిమాలో హీరోగా మలయాళం నటుడు కన్నా, హీరోయిన్‌గా గెహజీ నటిస్తున్నారు. డైరెక్టరుగా అశోక్‌రాజు, నిర్మాతగా ప్రియ మాదల వ్యవహరిస్తున్నారు. సంగీతం ప్రియేష్ సమకూరుస్తున్నారు. చీడికాడ గ్రామానికి చెందిన గండి గోపి సపోర్టింగ్ యాక్టర్‌గా నటిస్తున్నారు. గండి గోపి పర్యవేక్షణలో ఈ చిత్రం షూటింగ్ జరుపుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ఆలయంలో అమ్మవారికి నటీనటులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు ఇతర కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, దేవరాపల్లి శ్రీనివాసరావు, భీమరశెట్టి పైడియ్యనాయుడు, వేమన గోవింద, జోన్నపల్లి రమేశ్, పాలకుర్తి క్రాంతి, కొప్పోజు రాజు, ధర్మిశెట్టి సూరిబాబు, మాజీ జెడ్పీటీసీ బి.భవానీ తదితరులు పాల్గొన్నారు.