
ఆయుధ పూజ
విజయం కోసం
ప్రత్యేక పూజలు
శమీ పూజతో పోటీకి సిద్ధం..
సాక్షి, మహబూబాబాద్: మహాభారతంలో పాండవులు జమ్మిచెట్టు మీదపెట్టిన ఆయుధాలను కిందికి దింపి యుద్ధానికి వెళ్లారని.. ఈమేరకు విజయం సాధించారని పురాణాలు చెబుతాయి. కాగా, దసరా(విజయ దశమి) రోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుందనే నమ్మకం నేటికీ ఉంది. కాగా మద్యం దరఖాస్తులు ప్రక్రియ మొదలైంది.. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీంతో పలువురు దసరా రోజు పూజలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పనులకు శ్రీకారం చుడుతున్నారు.
మద్యం దరఖాస్తులకు శ్రీకారం
మద్యం వ్యాపారులకు ఇది కీలకమైన సమయం. గత నెల 26 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.అయితే షాపుల కేటాయింపు ప్రక్రియ అంతా అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో దరఖాస్తుకు రూ. 2లక్షల రుసుము ఉండగా.. ఇప్పుడు రూ.3లక్షలకు పెంచారు. మద్యం వ్యాపారమే సర్వంగా భావించే వారు షాపులను దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు పెట్టి దరఖాస్తు చేసుకుంటారు. అదృష్టం బాగాలేకపోతే ఒక్క షాపు దక్కని వారు ఉంటారు. అదృష్టం ఉంటే ఒక్క దరఖాస్తు వేసిన వారికి షాపు దక్కిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే అదృష్టం కలిసి రావాలని దసరారోజు పూజలు చేసి డీడీలకు డబ్బులు చెల్లించడం.. డీడీలను పూజలో పెట్టి పూజించడం, జమ్మి పూజలో చీటీలపై మద్యం షాపులు దక్కాలని కోరుతూ.. కాల్చి వేయడం వంటి పనులకు వ్యాపారులు సిద్ధం అవుతున్నారు.
ఒకవైపు మద్యం టెండర్లు..
మరోవైపు స్థానిక ఎన్నికలు
అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహుల సన్నద్ధం
దసరా పూజతో
మొదలు పెట్టనున్న పనులు
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో.. పలువురు నాయకులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు పోటీకి సిద్ధమవుతున్నారు. దసరా రోజు శమీ పూజతో పనులు మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కు అనుకూలమైన స్థానాలను ఎన్నుకున్నవారు.. గాడ్‌ఫాదర్స్, రాజకీయ పెద్దలను కలిసి.. టికెట్ ఇప్పించడం.. గెలిపించేందుకు కృషి చేయాలని ఆశీస్సులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లు పండుగకు సొంతూళ్లకు రావడంతో వారిని కలిసి ఓట్లు వేసేందుకు తప్పకుండా రావాలని కోరడం.. వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు తీసుకునే పనిలో ఉన్నారు. ఇలా ఒక వైపు మద్యం షాపులను దక్కించుకునేందుకు కొందరు.. పోటీలో నిలబడి గెలిచేందుకు రాజకీయ నాయకులు దసరా ముహూర్తం ఎన్నుకొని తమ పనులకు శ్రీకారం చుడుతున్నారు.