
పరిసరాలు శుభ్రంగాఉంచుకోవాలి
నారాయణపేట టౌన్: పట్టణంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కురిసిన అకాల వర్షాలకు మురికి కాలువల ద్వారా చెత్తా, ప్లాస్టిక్ రోడ్డుపై పేరుకుపోయినా ఇసుకను మున్సిపల్ కార్మికులతో తీయించారు. అదే విధంగా బతుకమ్మ సంబరాల కోసం స్థానిక బారం బావి దగ్గర శుభ్రం చేయించి వేడుకలకు సిద్ధం చేశారు. హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుపైకి వాలిన కొమ్మలను దగ్గరుండి తొలగింప చేయించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూనే ఆరోగ్యంగా ఉంటామని కావునా పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు చుట్టుపక్కల చెత్త చెదారం పేరుకుపోకుండా చూసుకోవాలని సూచించారు.
భూ సేకరణ ప్రక్రియపూర్తిచేయండి
నారాయణపేట: జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన భూ సేకరణపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సేకరణ ప్రక్రియపై జాప్యం చేయొద్దని సూచించారు. వీసీలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను, ఆర్డీఓ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు సరికాదు
నారాయణపేట రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని న్యాయబద్ధంగా పోరాటం చేస్తు న్న వారిని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చే యించడం సరికాదని సీపీఐ(ఎం.ఎల్)మాస్‌లైన్ కార్యదర్శి కాశీనాథ్ విమర్శించారు. ప్రగతి శీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ కార్మికుల డిమాండ్ల సాధనకు సోమవారం ‘చలో హైదరాబాద్’ ఎస్‌పీడీ కార్యాలయం ముట్టడి చేపట్టగా పలువురు నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై విమర్శలు గుప్పించారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలనీ, కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్ పోస్టులకు 10వ తరగతి విద్యార్హత నిబంధన తొలగించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ కల్పించాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాలనే తదితర డిమాండ్లపై శాంతియుతంగా తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయడం దారుణమన్నారు. అధికారానికి రాక ముందు ఒకలా మాట్లాడి ఇపుడు అప్రజాస్వామికంగా కార్మిక గొంతులు నొక్కాలని చూడడం అత్యంత హే యమైన చర్య అని మండిపడ్డారు. కార్యక్రమంలో సరిత, నర్సింలు, లక్ష్మి పాల్గొన్నారు.