
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
నారాయణపేట: జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో వ్యవసాయ, మార్కెటింగ్, హార్టికల్చర్ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో క్రాప్ బుకింగ్‌ను వందశాతం పూర్తిచేసి.. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త యాప్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మిల్లుల వద్ద పత్తి రైతులు నిరీక్షించే పరిస్థితి ఉండదని అన్నారు. గతంలో మిల్లర్లు ఎల్–1, ఎల్–2 ప్రకారం పత్తిని కొనుగోలుచేసే వారని.. ఈ సారి ఆ విధానాన్ని రద్దుచేసి అన్ని మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సారి కౌలు రైతులు కూడా విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదే విధంగా ఆయిల్‌పాం సాగుతో కలిగే లాభాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి.. జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్‌పాం సాగు లక్ష్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్ల విషయంలో గతేడాది జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఏఓ జాన్‌సుధాకర్, సీపీఓ యోగానంద్, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారిణి బాలమణి, ఆర్టీఓ మేఘాగాంధీ, డీఎస్‌ఓ బాల్‌రాజ్, సీసీఐ స్టేట్ జనరల్ మేనేజర్ ప్రజక్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ఉన్నారు.
బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమై బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేయాలన్నారు. ముఖ్యకూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో హోర్డింగ్స్, బతుకమ్మ నమూనాల ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రంలోని బారంబావి, కొండారెడ్డి చెరువు వద్ద లైటింగ్స్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్యను కలెక్టర్ ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, నీటివనరుల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే బతుకమ్మ ఉత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలన్నారు. 30న సద్దుల బతుకమ్మ వేడుకలను పెద్దఎత్తున నిర్వహించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, ఏఓ జయసుధ ఉన్నారు.
జిల్లాలో క్రాప్ బుకింగ్‌ను వందశాతం పూర్తిచేయాలి
కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకుఅవగాహన కల్పించాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్