
పువ్వులను పూజించడం గొప్ప సంస్కృతి
● ఎస్పీ యోగేష్ గౌతమ్
● జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ సంబరాలు
నారాయణపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని.. ఎక్కడైనా దేవుళ్లకు పూలతో కొలుస్తామని, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందని.. ఇది గొప్ప సంస్కృతని ఎస్పీ యోగేష్ గౌతమ్ కొనియాడారు. మంగళవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు కోలాటలు, బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల కుటుంబ సభ్యులను కలిసినందుకు, వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మ అని.. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. బతుకమ్మ పాటలు వినసొంపుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హూల్‌హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, సీఐ నర్సింహ, మహిళా ఎస్‌ఐలు సునీత, గాయత్రి, శ్వేత, శిరీష, మహిళ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పువ్వులను పూజించడం గొప్ప సంస్కృతి