
నల్లబ్యాడ్జీలతో నిరసన
నారాయణపేట: మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ బోధన వైద్యుల సంఘం (టీటీజీడీఏ), నారాయణపేట యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి ఎదుట వైద్యులు, వైద్యసిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. 65 ఏళ్ల రోగికి వైద్యం చేసి బతికించడానికి ప్రయత్నించినందుకు వారి బంధువులు దాడులు చేయడం హేయమైన చర్యని, ఖండిస్తున్నామన్నారు. వైద్యుడు తనకు తెలిసిన వైద్య విజ్ఞానంతో ఉన్న సౌకర్యాలు వినియోగించుకొని నాణ్యమైన వైద్యం అందించడానికి చూస్తారని వారు వివరించారు.
నేడు డయల్
యువర్ డీఎం
నారాయణపేట టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తున్నట్లు నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట, కోస్గి పరిసర ప్రాంతాల ప్రయాణికులు నిర్దేశిత సమయంలో సెల్‌నంబర్ 73828 26293 తమ సమస్యలు, విలువైన సలహాలు, సూచనలు తెలియజేయాలని పేర్కొన్నారు.
ముగిసిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరం
నారాయణపేట: భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి, 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేంద్రంలోని పాత ఆస్పత్రి ఆవరణలో ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, జిల్లా ఉప వైద్యాధికారి డా. శైలజ శిబిరాన్ని ప్రారంభించారు. 229 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రక్తపోటు, మధుమేహం, కీళ్ల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సీనియర్ విశ్రాంత వైద్యాధికారులు డా. శౌర్య, డా. నారాయణ, డా. శివచందర్‌గౌడ్, యోగా శిక్షకుడు సురేష్, జిల్లా ఆయుష్ ప్రోగ్రామ్ అధికారి డా. రఘుకుమార్ ప్రాచీన ఆయుర్వేదం విశిష్టతను వివరించారు. ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని.. వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆయుష్ వైద్యాధికారులు డా. హరీష్ చక్ర, డా. కె.తిరుపతి, డా. నాగజ్యోతి, డా. సుధారాణి, ఆయుష్ ఫార్మాసిస్టులు సాక సాయిబాబా, అనిత, ఎస్‌ఎన్‌ఓఆర్ సంతోష్‌కుమార్, అరుణ, యోగా శిక్షకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలతో నిరసన