
పెంపుడు జంతువులకు టీకాలు తప్పనిసరి
నారాయణపేట రూరల్: పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా వెటర్నరీ అధికారి డా.ఈశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఆదివారం ప్రపంచ యాంటీ రేబిస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లలకు మూడు నెలల వయసు రాగానే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. నెల రోజుల తర్వా త మరోమారు బూస్టర్ టీకా వేయించాల్సి ఉంటుందన్నారు. మనుషులకు పిల్లి, కుక్క, కోతులు కరిచినప్పుడు వరుసగా 3, 7, 14, 28వ రోజు టీకాలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సంక్రమిస్తుందని.. కుక్కల లాలాజలం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. జంతువులు కాటు వేసినప్పుడు నిర్లక్ష్యం చేయరాదన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యం తీసుకోవాలన్నారు. రేబిస్ డే సందర్భంగా జిల్లావ్యాప్తంగా 197 పెంపుడు జంతువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి అనిరుధ్ ఆచార్య, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు సామూహిక
అక్షరాభ్యాసం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞానసరస్వతి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉమ్మడి జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.