
ముంపు ముప్పు
● కృష్ణా, భీమా నదుల్లో
పెరిగిన వరద ఉధృతి
● భయం గుప్పిల్లో
నదీ తీర గ్రామాల ప్రజలు
● వాసునగర్‌ను ఖాళీ చేయాలని
రెవెన్యూ అధికారుల సూచన
మక్తల్/కృష్ణా: రెండు రోజులుగా కృష్ణా, భీమా నదుల్లో వరద ఉధృతి భారీగా పెరిగింది. నదీ తీర గ్రామాల సమీపాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే నదీ పరీవాహకంలోని వందలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. కృష్ణా మండలంలో కృష్ణానది ఒడ్డున ఉన్న వాసునగర్, మారుతీనగర్ గ్రామాలతో పాటు భీమా నదీ తీరంలోని హిందూపూర్ గ్రామంలోకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలను తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ ఎండీ నవీద్ పరిశీలించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. వాసునగర్, మారుతీనగర్ గ్రామాల ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అదే విధంగా భీమా నది నుంచి హిందూపూర్‌లోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కాలనీవాసులు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే, 2009లో అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, భయానక పరిస్థితులు ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. మరోసారి వరద ముంపు ముప్పు భయం నదీ తీర గ్రామాల ప్రజలను వెంటాడుతోంది. రెండు రోజులుగా భీమా, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల వ్యవసాయ పొలాలు నీటమునగడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మండల వ్యవసాయాధికారి సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి మునకకు గురైన పంటలను పరిశీలించారు. కృష్ణా మండలంలో 185 మంది రైతులకు చెందిన 785 ఎకరాల వరిపంట నీటమునిగి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. అదే విధంగా భీమా నది పరీవాహక ప్రాంతంలోని సూకూర్‌లింగంపల్లి, కుసుమర్తి, తంగిడి గ్రామాల్లో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా మక్తల్ మండలం పస్పుల ఘాట్ వద్ద ఉన్న దత్తక్షేత్రంలోకి వరద చేరింది. కృష్ణానదిపై ఉన్న నారాయణపూర్, భీమానదిపై ఉన్న గూడూరు బ్రిడ్జి కం బ్యారేజీ నుంచి 5.20లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగిందని అధికారులు తెలిపారు. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర సరిహద్దులోని భీమా నదిపై ఉన్న గూడూర్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి
మక్తల్ మండలం
పస్పుల దత్తక్షేత్రం వద్ద ఇలా..

ముంపు ముప్పు