
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
మక్తల్: తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య సహకార, పాడిపరిశ్రమల, క్రీడా శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో రాంలీలా మైదానంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా.. మంత్రితోపాటు ఆయన సతీమణి వాకిటి లలిత ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల మహిళలు బతుకమ్మలతో రాంలీలా మైదానానికి చేరుకున్నారు. మంత్రి సతీమణి సైతం బతుకమ్మతో అక్కడికి వచ్చి మంత్రితో కలిసి బతుకమ్మలకు పూజలు చేశారు. బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందరు ఐక్యత, అటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎంతో అనందంగా ఉందని అన్నారు. రాష్ట వ్యాప్తంగా తొమ్మిదిరోజులపాటు బతుకమ్మ పూజలు చేస్తారని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఓ పక్క భారీ వర్షం కురుస్తున్న బతుకమ్మలతో రావడంపై మహిళలను అభినందించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, రాదమ్మ, గణేష్‌కుమార్, రవికుమార్, రాజేందర్, గోవర్ధన్, కట్ట వెంకటేస్, కట్ట సురేష్ పాల్గొన్నారు.
రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం
కృష్ణా: మండలంలోని కృష్ణా, భీమా నదులు ఉప్పొంగడంతో నదీతీర ప్రాంతాల్లోని వరి పంటల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లగా.. విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం తంగిడిలో సంఘమక్షేత్రాన్ని పరిశీలించారు.అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి దిగువకు అత్యధికంగా 5.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో ఈ ప్రాంతంలోని రైతుల పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోందని, పంటలు నీటమునిగాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడంతోపాటు వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. వరద విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.