జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలు

Sep 30 2025 9:32 AM | Updated on Sep 30 2025 9:32 AM

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలు

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలు

రాజకీయ పోస్టర్లు,

ఫ్లెక్సీలు తొలగించాలి

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేట: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తక్షణమే స్థానిక సంస్థల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎన్నికల ప్రవర్తన నియమావళి )అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. సోమవారం ప్రజావాణి సమావేశ మందిరమంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం షెడ్యూల్‌ ప్రకటించడం జరిగిందని అందువల్ల తక్షణమే కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, కొత్త మంజూరులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపడానికి వీలు లేదన్నారు. అధికారులు నాల్గవ తరగతి ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు పొరుగుసేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్‌ పరిధిలో మాత్రమే పనిచేస్తారని, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులతో కలిసి, పార్టీ ర్యాలీలో పాల్గొనడం, మరే ఇతర రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని, అలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కోడ్‌ అమల్లో వచ్చిన ప్రాంతాల్లో వెంటనే రాజకీయ ప్రచారాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, గోడ రాతలు తొలగించాలని ఆదేశించారు. ఈ రోజు నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ ఎస్‌ శ్రీను, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో గల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ( పట్టణ ఆరోగ్య కేంద్రం) ను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్‌ లోని అన్ని గదులను పరిశీలించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా.. లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌కు వచ్చిన పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను చూసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఆస్పత్రి లోని అన్ని గదుల కిటికీలకు దోమలు రాకుండా జాలి ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ హెల్త్‌ సెంటర్‌లో రక్త పరీక్ష చేయించుకున్నారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జయ చంద్రమోహన్‌, హెల్త్‌ సెంటర్‌ వైద్య అధికారి డాక్టర్‌ నరసింహారావు సగరీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ల

నిర్మాణం చేపట్టాలి

నారాయణపేట రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె పరిశీలించారు. అప్పక్పల్లిలో ఓ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచడంతో లబ్ధిదారురాలిని అభినందించారు. అప్పక్‌పల్లికి మొత్తం 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 16 ఇళ్ల నిర్మాణాలు రూఫ్‌ లెవల్‌, స్లాబ్‌, లెంటల్‌ లెవల్‌ లో కొనసాగుతున్నాయని హౌసింగ్‌ పీడీ శంకర్‌నాయక్‌ కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో నారాయణపేట మండలం పురోగతిలో ఉండటంపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుదర్శన్‌, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పకడ్బందీగాస్థానిక సంస్థల ఎన్నికలు

జిల్లాలో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీలకుగాను రెండు విడతల్లో ఎన్నికలు, అలాగే జిల్లాలోని 272 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో 67 , రెండో విడతలో 95, మూడో విడతలో 110 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ వివరించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇస్తామని, బ్యాలెట్‌ బాక్స్‌లు, పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశామని, మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. బోర్డర్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టేలా పోలీసుశాఖ ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు. అదనపు కలెక్టర్‌ శ్రీను, ట్రైనీ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, ఆర్డీఓ రామచంద్రనాయక్‌, జెడ్పీ సీఈఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement