
ఎరుపెక్కిన తెల్లబంగారం
ఈ చిత్రంలో ఎరుపెక్కిన పత్తిపంట చూపుతున్న రైతు పేరు విజయ్. పల్లెగడ్డకు చెందిన ఈయన 5 ఎకరాల్లో పత్తి సాగు చేయగా వర్షాలకు దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. వర్షాల కారణంగా పొలంలో నీటిశాతం అధికం కావడంతో ఒక్కసారి కూడా పత్తితీయక ముందే పంటకు ఎరుపు తెగుళ్లు సోకింది. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెడితే మూడు క్వింటాళ్ల పత్తి వచ్చే పరిస్థితి లేదని రైతు వాపోతున్నాడు. ఇప్పటి వరకు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టాడు. మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి కేవలం రూ.5వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంది. కానీ రూ.లక్ష వరకు కూడా ఆదాయం రాని పరిస్థితి ఉందని బాధిత రైతు ఆవేదన చెందుతున్నాడు.
మరికల్: జిల్లాలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పత్తి పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నేల తడి ఆరకముందే వానలు కురుస్తుండటం ఎండలు లేక మబ్బులు ఆవరిస్తుండటంతో పూత రాలిపోతోంది. ఆకులు ఎర్రబారుతున్నాయి. కాయలు నల్లగా మారి రాలిపోతున్నాయి. పచ్చని ఆకులు, తెల్లని పత్తితో కళకళలాడాల్సిన పొలాలు పూత, కాత లేకుండా ఎండిపోయి కనిపిస్తుండటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు పచ్చగా ఉన్న పంట రైతుల కళ్లెదుటే పత్తి పంట అమాంతం ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసురు వర్షాలతో పొలాల్లోనే గింజలకు మొలకలు వస్తున్నాయి. పంట చేతికి వచ్చే తరుణంలో మొలకలు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
జిల్లాలో 1.68 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగు చేస్తారు. జిల్లాలో ఈ ఏడాది 1.68 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మొదట కురిసిన వర్షాలకు మొక్కలు ఏపుగా పెరిగాయి. పూత, కాయ బాగుండడంతో ఆశించిన దిగుబడి వస్తుందని రైతులు ఆనంద పడ్డారు. వరుసగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను నిండా ముంచాయి. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జిల్లాలో భిన్నమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది సాగు చేసిన పత్తిలో ఎకరానికి కనీసం రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు.
ఎకరాకు మూడు క్వింటాళ్లే..
రోజుల తరబడి కురుస్తున్న ముసురు వర్షాలతో పంటలకు సూర్యరశ్మి తగలక పత్తి మొక్కల్లో నీటిశాతం పెరిగి వాడిపోతున్నాయి. ఎండల్లేక కాయలు పగలటం లేదు. దీనికితోడు పొలాలు బురదగా మారడంతో కూలీలు పత్తితీత పనులకు రావడంలేదు. తడిసిన పత్తి నల్లగా మారుతుండటంతో మద్దతు ధర దక్కడం కష్టంగా మారింది. పోషకాలు అందక ఆకులు పసుపు ఎరుపు రంగుల్లోకి మారి ఎండిపోతున్నాయి. ఒక్కో రైతు మూడు నుంచి ఐదుసార్లు పత్తి ఏరుతుంటారు. కానీ, పూత లేకపోవటంతో ఒక్కసారికే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎకరాకు పది క్వింటాళ్లు వచ్చే దిగుబడి ఇప్పుడు మూడు, నాలుగు క్వింటాళ్లకే పరిమితమవుతోందని రైతులు వాపోతున్నారు.
నీటి శాతం పెరగడం వల్లే తెగుళ్లు
అధిక వర్షాల వల్ల పంట వేర్లకు పోషకాలు అందక పత్తి కాయలు నల్లగా, ఆకులు ఎర్రగా మారి చివరకు చెట్టు ఎండిపోతుంది. దీంతో పంట దిగుబడులు కూడా తగ్గాయి. పంటకు పైన పిచికారీతో పోషకాలు అందించాలి. 3 గ్రాముల ఫంగీసైస్ కాఫర్ ఆక్సీక్లోరైడ్‌ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి 5 గ్రాముల యూరియా లేదా 15.15.15, లేదా 19.19.19 చల్లాలి. అప్పుడు పంటలో తెగుళ్ల శాతం తగ్గే అవకాశం ఉంది.
– జాన్‌సుధాకర్, ఏడీఏ
ఎడతెరిపి లేని వర్షాలతోపత్తి పంటకు తెగుళ్ల బెడద
తడిఆరని పొలం.. అమాంతం పడిపోయిన దిగుబడి
పెట్టుబడి ఆశలు సైతం ఆవిరి

ఎరుపెక్కిన తెల్లబంగారం

ఎరుపెక్కిన తెల్లబంగారం