
బీజేపీ విధానాలతోనే సాగు సంక్షోభం
● ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 15న ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జండా ఎగురవేస్తూ తానెప్పుడూ రైతుల వైపే ఉంటానని మాట ఇచ్చి మరుసటి రోజే పత్తిపై ఉన్న 11 శాతం సుంకాన్ని ఎత్తివేశారన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత్‌లో పర్యటించి వెళ్లిన పది రోజుల తర్వాత వంటనూనెలపై పది శాతం ఉన్న సుంకాన్ని మోదీ ఎత్తివేశారని తెలిపారు. అమెరికాకు తలొగ్గి అన్ని వస్తువులపై సుంకం ఎత్తివేస్తే ఇక్కడి మిల్లర్లు అమెరికా పత్తి, వంటనూనెలను దిగుమతి చేసుకోవడంతో రైతులు చాలా నష్టపోతారని వివరించారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఎలా తిప్పికొట్టామో ఇప్పుడు సుంకం ఎత్తివేతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మోదీని, ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఎస్‌కేఎం ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రాము, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, కార్మిక, ప్రజా, రైతు సంఘాల నాయకులు భగవంతు, అంజలయ్య. యాదగిరి, గోపాల్, కాశీనాథ్, ఆంజనేయులు, సలీం, ప్రశాంత్, కిరణ్, బలరాం, రాము, మహేశ్‌గౌడ్ తదిరతరులు పాల్గొన్నారు.