
హైకోర్టు సీజే రాక
నేడు బొప్పూడికి
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి, మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమాలకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు రానున్నట్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆలయాలకు సంబంధించిన నక్షత్ర వనం, రాశి వనం, పంచవటి, నవగ్రహ వనంలో మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు, ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణమోహన్‌తో పాటు జస్టిస్ రవినాఽఽథ్ తిహారి, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వి. శ్రీనివాస్, జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ వై. లక్ష్మణరావు, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పాల్గొననున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఎండోమెంట్ కమిషనర్ కె. రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి డి.కళ్యాణ చక్రవర్తి ఇతర అధికారులు హాజరవుతారన్నారు. స్వామి వార్ల భూమి 1.20 ఎకరాల్లో నక్షత్రాలు, రాశుల వారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.
తెనాలి: మారీసుపేటలోని బాలాత్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవస్థానంలోని బతకమ్మ ఉత్సవ మహిళా సంఘం ఆధ్వర్యంలో బతకమ్మ పూజలు ముగిశాయి. గత నెల 22వ తేదీన ఆరంభమైన పూజల్లో రోజూ బతకమ్మకు వివిధ అలంకారాలు చేశారు. శనివారం అమ్మవారి ఓలలాడింపు ఘనంగా నిర్వహించారు.