
తాగునీటి ప్లాంట్‌పైనా ‘పచ్చ’ పైత్యం
● వైఎస్సార్‌సీపీ మద్దతుదారులనే
నెపంలో మూసివేత
● అత్యుత్సాహంతో జోక్యం
చేసుకున్న పోలీసులు
మాదల(ముప్పాళ్ళ): వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన వారిని భయపెడుతూ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ తమ వైపు తిప్పుకొనేందుకు పచ్చపార్టీ నేతలు చర్యలు ప్రారంభించారు. ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అభ్యర్థులను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. అందులో భాగంగానే మాదల గ్రామంలో శ్రీకృష్ణ సేవా సమితి పేరుతో 2011 నుంచి నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌ను సైతం శనివారం మూసివేయించారు. కేవలం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులనే కారణంతోనే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా పోలీసుల సాయంతో తాళం వేయించి తాగునీటి సరఫరాను అడ్డుకున్నారు. శ్రీకృష్ణ సేవా సమితి పేరుతో గ్రామంలోని బీసీ ఏరియాలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ గోగుల అంజిబాబు కుటుంబసభ్యులు 2011 నుంచి వాటర్‌ప్లాంట్ నిర్వహిస్తున్నారు. అసలు టీడీపీ ఎంపీటీసీలే లేని మండల పరిషత్ కార్యవర్గంలో ఎంపీపీ పదవిపై కన్నేసి, పార్టీ మారాలంటూ ఎంపీటీసీపై ఒత్తిడి చేశారు. పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ, వారి ప్రలోభాలకు లొంగకపోవటంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలు తెరతీశారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అన్ని అనుమతులు ఉన్నా పోలీసులు కూడా టీడీపీ నాయకుల ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదేమని ప్రశ్నిస్తే పై నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ చెబుతున్నారు. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.