
తొలగింపు.. తూతూమంత్రమే
ఫలితం శూన్యం
● నరసరావుపేటలోని పలు మార్గాల్లో
ఇటీవల ఆక్రమణల తొలగింపు
● ముణ్నాళ్ల ముచ్చటగా మారిన
మున్సిపల్ అధికారుల చర్యలు
● మళ్లీ యథావిధిగా ఆక్రమణలతో
నిండుతున్న రహదారుల మార్జిన్లు
● రద్దీతో వాహనదారులకు నిత్యం
తప్పని ట్రాఫిక్ అవస్థలు
నరసరావుపేట: గతేడాది నుంచి మున్సిపల్ అధికారులు చేపట్టిన ప్రధాన రోడ్ల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం విఫలమైంది. సుమారు 1.60 లక్షల మంది జనాభా ఉన్న పురపాలక పట్టణంలోని నాలుగు ప్రధాన రోడ్లు ఆక్రమణలతో మళ్లీ కుంచించుకుపోతున్నాయి. గతేడాది డిసెంబరు నుంచి చేపట్టిన ఆక్రమణల తొలగింపు అధికారులు ఆరు నెలలపాటు కొనసాగించారు. రెండు నెలలుగా మిన్నకుండిపోవటంతో వ్యాపారులు మళ్లీ రోడ్ల మార్జిన్‌లను ఆక్రమించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
పట్టణంలోనే సగం జనాభా
నియోజకవర్గంలో సగం జనాభా పట్టణంలోనే నివాసం ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని పట్టణాన్ని మాస్టర్‌ప్లాన్‌ను పునరుద్ధరించి 14 చదరపు కిలోమీటర్ల మేరకు పెంచింది. పట్టణానికి నాలుగువైపులా ఉన్న రావిపాడు, లింగంగుంట్ల, యల్లమంద, కేసానుపల్లి, ఇసప్పాలెం పంచాయతీల పరిధిలోని భాగాలను పట్టణ పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పటివరకు ఉన్న 34 వార్డులను 38కి పెంచారు. ఇలా విద్య, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పల్నాడురోడ్డు, గుంటూరు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, వినుకొండ వైపునకు వెళ్లే ప్రధాన రోడ్లు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. ట్రాఫిక్ పోలీసులు, అధికారులకు కత్తిమీదసాములా పరిస్థితి మారింది. ఈ మార్గాలలో సెంట్రల్ డివైడర్లు ఉన్నా ఫలితం శూన్యమనే చెప్పాలి.
కఠిన చర్యలు తీసుకుంటాం
దీనిపై మున్సిపల్ టీపీఓ కె.సాంబయ్యను వివరణ కోరగా...‘పట్టణంలో చాలావరకు ఆక్రమణలు తొలగించాం. తొలగించిన చోట మళ్లీ కొంతమంది ఆక్రమిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల తొలగింపు నిరంతరం కార్యక్రమం. ఇకపైనా కొనసాగిస్తూనే ఉంటామని’ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకు పురపాలక సంఘంలో తమకు ఇష్టమైన అధికారులను రప్పించుకున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు... పోలీసుల సహాయంతో ఆక్రమణల తొలగింపును హడావుడిగా చేపట్టారు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించారు. తోపుడు బండ్లను వ్యాపారులు రోడ్లపై పెట్టకుండా నియంత్రించారు. రోడ్లు ఎత్తు పెంచుతూ ఆక్రమణదారులు పోసిన మట్టిని ప్రొక్లయినర్, ట్రాక్టర్ సహాయంతో తవ్వించారు. ఆ మట్టిని పలు పల్లపు ప్రాంతాలలో పోయించారు. ఆక్రమణలు తీసేందుకు సమయం కోరిన వారికి అవకాశం ఇచ్చారు. ఆ రెండు రోజులు అంతా బాగానే ఉందనిపించింది. తీరా ఇప్పుడు మళ్లీ ఆక్రమణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు వరకు మార్జిన్‌లో పండ్లు గుట్టలుగా పెట్టుకొని వినియోగదారుల కోసం ఎదురుచూసే వారు ఎక్కువయ్యారు. వినుకొండ రోడ్డు, పల్నాడు రోడ్లలో బిర్యానీ కేంద్రాల నిర్వాహకులు రోడ్లపైనే వంటకాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా సంస్థలకు చెందిన జనరేటర్లు కూడా రోడ్లపైనే ఉంటున్నాయి. చాలా వ్యాపార సంస్థలకు పార్కింగ్ సౌకర్యం లేకపోవటంతో రోడ్ల మార్జిన్‌లోనే వినియోగదారులు వాహనాలు ఆపాల్సిన పరిస్థితి నెలకొంది.
అసలే ఇరుకు రోడ్లు.. ఆపై ఆక్రమణలు.. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని రోడ్ల పరిస్థితి ఇదీ. పాదచారులు రోడ్డుపై నడవాలన్నా, వాహనాలపై సక్రమంగా ప్రయాణించాలన్నా ఏ వాహనం వచ్చి తమను ఢీకొంటుందోననే భయంతో సంచరించాల్సి వస్తోంది. జిల్లాకు నూతనంగా కలెక్టర్, ఎస్పీలు బాధ్యతలు చేపట్టారు. మార్పు ఏమన్నా వస్తుందా అని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.