
నీటి సంరక్షణకు సత్వర ఏర్పాట్లు
బొల్లాపల్లి: జిల్లాలో నీటి సంరక్షణలో భాగంగా భూగర్భ జలాల పెంపునకు శ్రీకారం చుట్టామని డ్వామా పీడీ ఎం.సిద్ధ లింగమూర్తి తెలిపారు. మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో శనివారం ఆయన బొల్లాపల్లిని సందర్శించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్, పొలంలో నీటి కుంట ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో భూగర్భ జల నీటిమట్టం 8.6 మీటర్లు లోతు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, ఇంకుడు గుంతలు, పొలాల్లో నీటి కుంటలు, ఫీడర్ చానల్స్ ఏర్పాటుకు పనులను చేపడతామని చెప్పారు. జిల్లాలో వెల్దుర్తి , బొల్లాపల్లి, మాచర్ల, మాచవరం, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడుతో పాటు మరో మండలంలో భూగర్భ జలాలు లోతుగా ఉన్నట్లు తెలిపారు. ఆయా మండలాల్లో నీటి సంరక్షణ కోసం సత్వరమే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
ఈకేవైసీ ఉంటేనే ఉపాధి పనులు
ఉపాధి హామీ పథకంలో జిల్లాస్థాయిలో 6.01 లక్షల లబ్ధిదారులు ఉన్నారని, వీరిలో 5.18 లక్షల మంది పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వివరించారు. వీరందరికీ ఈకేవైసీ ఉంటేనే పనులు కల్పిస్తామని, ఎన్‌ఎంఎంఎస్ ప్రత్యేక యాప్ ద్వారా హాజరు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఈకేవైసీ పూర్తి కావచ్చిందని చెప్పారు. 2025 జూలై 15 వరకు ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.
జిల్లాలో 524 గ్రామ సభలు పూర్తి చేశామని, నూతన పనులకు ప్రతిపాదనలు తయారుచేసి మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బొల్లాపల్లి మండలంలో 17వ విడత సామాజిక తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 7న సామాజిక తనిఖీ ప్రజా వేదిక బహిరంగ సభ ఉంటుందని డ్వామా పీడీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి. మాధురి, ఉపాధి హామీ పథకం ఏపీవో ఎం. లక్ష్మణరావు, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్పీ బి. ఆవులయ్య, సిబ్బంది పాల్గొన్నారు.