
విశ్రాంత అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విశ్రాంత అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని రాష్ట్ర జూనియర్ కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘ రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే, సహచర పెన్షనర్ సంఘాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడం బాధాకరమని తెలిపారు. 70 నుంచి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలను చెల్లింపుతో పాటు 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ వ్యవస్థ నుంచి వచ్చిన పెన్షనర్లకు మెడికల్ రీ–యింబర్స్‌మెంట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లందరికీ అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు.
ఆదాయపు పన్నును రద్దు పర్చి, గతంలో ఉన్న రైలు ప్రయాణ టికెట్ రాయితీని పునరుద్ధరించాలని విన్నవించారు. మానిటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ అధ్యాపకుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి.భాస్కరరావు, జెడ్.ఎస్. రామచంద్రరావు, జి.సుబ్బారావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు