
విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి
లక్ష్మీపురం: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు అంటించిన దుండగులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మరో విగ్రహాన్ని ప్రతిష్టించింది గానీ, ఘటన జరిగి మూడు రోజులైనా దోషులను అరెస్టు చేయకుండా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు నిత్య కృత్యమయ్యాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురంలో దళితులపై దాడులు చేస్తే నిందితులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ఘటనలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపును తెలియజేస్తుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నగర అధ్యక్షులు జి.లూథర్ పాల్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం మీద నిరంతరం దాడి జరుగుతోందని విమర్శించారు. దళితులను చదువుకు, మానవీయ విలువలకు దూరంగా ఉంచిన మనువాద సిద్ధాంతాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు అందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి బి.ముత్యాలరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్, కేవీపీఎస్ నాయకులు యం.సుందరబాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి జాన్ బాబు, నాయకులు జి. వెంకట్రావు, ప్రసాద్ పాల్గొన్నారు.
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి