
హిందీ భాషకు పెరుగుతున్న ప్రాధాన్యం
తెనాలి: స్వదేశంలోనే ఉద్యోగాలను వెతుక్కోవాల్సి వస్తున్నందున హిందీ భాష అవసరం ఏర్పడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్, ప్రముఖ రచయిత రావెల సాంబశివరావు అభిప్రాయపడ్డారు. స్థానిక హిందీ ప్రేమి మండలి మహా విద్యాలయంలో ఏటా జరిగే గాంధీ జయంతి, బోయపాటి నాగేశ్వరరావు–సుభద్రాదేవి గురు దంపతుల 23వ వార్షిక గురుపీఠ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మహా విద్యాలయం ప్రాంగణంలోని మోటూరి సత్యనారాయణ స్మారక సభా వేదికపై జరిగిన సభకు రావెల సాంబశివరావు అధ్యక్షత వహించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు, రచయిత ప్రొఫెసర్ నారాయణ, కాకినాడకు చెందిన విశ్రాంత హిందీ అధ్యాపకురాలు, రచయిత్రి షేక్ కాశింబీకి గురుపీఠ పురస్కారాలు, నగదును ప్రదానం చేసి సత్కరించారు.