
రోడ్లపై ప్రయాణమే నరకప్రాయం!
గోతులతో అధ్వానంగా ప్రధాన రహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు కనీసం పట్టించుకోని కూటమి పాలకులు
‘‘ఆటో డ్రైవర్లు గత ప్రభుత్వ హయాంలో రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉండేవి. గుంతల రోడ్లతో పడరాని పాట్లు పడ్డారు. అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే రూ.1,400 కోట్లు ఖర్చు చేసి గుంతల రహదారులకు మరమ్మతులు పూర్తి చేశాం...’’ ఇవీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రధాన రోడ్లు సైతం భారీ గుంతలతో అధ్వానంగా మారాయి. ప్రజలు ఈ మార్గాల్లో ప్రయాణంఅంటేనే నరకప్రాయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సత్తెనపల్లి: ఎన్నికల వేళ అభివృద్ధే లక్ష్యమని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం గత జనవరికే రోడ్లన్నింటినీ బాగు చేసి అద్దాల్లా మారుస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసింది. కానీ అధికారం చేపట్టి 16 నెలలవుతున్నా కనీసం మరమ్మతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. తట్ట మట్టి పోసిన దాఖలాలు కూడా లేవు. ఫలితంగా గుంతలు పడిన రహదారుల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మార్గాల్లో భారీ గుంతలు
సత్తెనపల్లి–మాదిపాడు ప్రధాన రహదారి అడుగడుగునా భారీ గుంతలు పడ్డాయి. కంకర రాళ్లు తేలి ఉండడంతో రాకపోకలకు ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. గోతుల వల్ల ఒళ్లు హూనం కావడంతోపాటు వాహనాలు దెబ్బతింటున్నాయని చోదకులు వాపోతున్నారు. వర్షాలకు కంకర మొత్తం లేచి పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా తయారైంది. మళ్లీ వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచిపోతోంది. సత్తెనపల్లి నుంచి లక్కరాజు గార్లపాడు, ఫణిదం, అమరావతి, కంటేపూడి.. ఇలా ఏ రోడ్డు చూసినా గోతులమయంగా మారాయి. ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి జారిపడుతున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక రోడ్డు, ప్రధాన రహదారి నుంచి రఘురాంనగర్‌కు వెళ్లే ప్రగతి కళాశాల రోడ్డు కూడా అధ్వానంగా ఉన్నాయి.
ఉపన్యాసాలకే పరిమితం
అభివృద్ధి, సంక్షేమం అని గొప్పలు చెబుతున్న కూటమి పాలకులు ఈ రహదారుల వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో రహదారులను అద్దంలా చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పాలకులు నేడు రోడ్ల మరమ్మతుల పేరిట భారీగా బిల్లులు చేసి దోచుకుంటున్నారే తప్ప పనులు చేయడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రహదారులను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్లపై ప్రయాణమే నరకప్రాయం!

రోడ్లపై ప్రయాణమే నరకప్రాయం!