
బియ్యం కాజేసి.. చిల్లర ఆశ చూపి..
రేషన్ దుకాణాల్లో సరుకులు ఇవ్వని డీలర్లు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం ఎంతో కొంత డబ్బు తీసుకోవాలని కార్డుదారులపై ఒత్తిడి మూడు, నాలుగు రోజులకే బియ్యం స్టాకు లేవని సాకులు తమ్ముళ్ల కనుసన్నల్లో పక్కదారి పడుతున్న పేదల బియ్యం పట్టించుకోని పౌర సరఫరాల శాఖ జిల్లా స్థాయి అధికారులు అర్ధాకలితో అలమటిస్తున్న పలు పేద కుటుంబాలు
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్లే పక్కదారి పట్టిస్తున్నారు. నల్లబజారుకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. బియ్యం తీసుకెళ్లేందుకు వచ్చిన లబ్ధిదారులకు చిల్లర ఆశ చూపుతున్నారు. వీరికి టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు సహకారం అందిస్తున్నారు. ఇలా అందరూ కలసి పేదల నోటి కాడ కూడును కూడా మింగేస్తున్నారు. గతంలో ఇంటి ముంగిటకు వచ్చి సరుకులు అందించే ఎండీయూ వాహనాలను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం... ఇప్పుడు కార్డుదారుల నోట్లో మట్టి కొడుతోంది. పార్టీ నాయకులకు దర్జాగా దోచిపెడుతోంది.
నరసరావుపేట టౌన్: ఇంటి వద్దకు వచ్చి రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించింది. ఆ పార్టీకీ చెందిన ద్వితీయ శ్రేణి కార్యకర్తలను ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్‌లుగా నియమించింది. పారదర్శకతకు విఘాతం కలిగించింది. దీంతో పేదల బియ్యం యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతున్నాయి. పల్నాడు జిల్లాలో 6,34,114 బియ్యం కార్డులు ఉండగా 18,36,592 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ప్రతి నెలా బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. బియ్యం తీసుకొచ్చిన నాలుగు రోజులకే ఖాళీ అయిపోయాయని. వచ్చే నెల రావాలని కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు తెగేసి చెబుతున్నారు. రెండు, మూడు రోజులకే అయిపోయాయా? అని ప్రశ్నిస్తున్న వారికి కొందరు దురుసుగా సమాధానం ఇస్తున్నారు. పంపిణీ ప్రారంభం నుంచి 15 రోజులపాటు సరుకులు ఇవ్వాల్సి ఉండగా రెండు, మూడు రోజుల్లోనే అయిపోయాయని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పల్నాడు జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అయితే రేషన్ మాఫియా బరి తెగించింది. పంపిణీ ప్రారంభం కాక ముందే పేదల బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ నల్లబజారులో రేషన్ బియ్యం రూ.20 వరకు ధర పలుకుతోంది. దీంతో అక్రమార్కులు డీలర్‌లతో కుమ్మకై ్క పేదల బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే అవకాశంగా మలుచుకొని కొందరు రేషన్ డీలర్‌లు బియ్యం పంపిణీ నామమాత్రంగా చేసి నల్లబజారుకు తరలిస్తున్నారు.
నగదు తీసుకోవాలని బెదిరింపు...
బియ్యానికి బదులుగా నగదు తీసుకోవాలని కార్డుదారులను డీలర్‌లు బెదిరిస్తున్నారు. ముందస్తుగా వేలిముద్రలు తీసుకొని ఆ తర్వాత నగదు ఇస్తామని కొంత మంది మోసం చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. బియ్యమే కావాలని అడిగే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉండటంతో కొంతమంది కార్డు దారులు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపటం లేదు. దీంతోపాటు ప్రతినెలా బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతోందన్న భయంతో మరికొందరు బియ్యం లేకపోయినా డీలర్‌లు ఇచ్చే డబ్బులు తీసుకునేందుకు రేషన్ షాపుల వద్దకు వస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న డీలర్‌లు కేజీకి రూ.8 చొప్పున కార్డుదారులకు ఇస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు వదిలేసి...
నిబంధనల ప్రకారం ప్రతి నెలా1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలి. ఉదయం 8 –11 , సాయంత్రం 4 –8 గంటల మధ్య సరుకులు పంపిణీ చేయాలి. స్టాక్ వివరాలు పొందుపరచాలి. రేషన్ షాపుల వద్ద స్పష్టంగా కనిపించే చోట బోర్డు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కార్డుదారుల ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్, సివిల్ సప్‌లై అధికారి ఫోన్ నంబరు అందుబాటులో ఉంచాలి. డీలర్‌లకు అవేమీ పట్టడం లేదు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో ఆ వైపు అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు.
ఈ అక్రమాలపై అధికారులు నిర్లక్ష్యం వహించటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచే పేదల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నా చర్యలు తీసుకోకపోవటం ఆరోపణలకు తావిస్తోంది. జిల్లా స్థాయి అధికారులు పరిపాలన కొనసాగించే నరసరావుపేటలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో రేషన్ మాఫియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమాలపై కార్డుదారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదనే విమర్శలు లేకపోలేదు. ఇకనైనా అధికారులు స్పందించి పేదలకు సక్రమంగా రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.