
సింగపూర్: మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ ఫార్ములావన్ తాజా సీజన్‌లో రెండో సారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ రేసులో రసెల్ అందరికంటే ముందు నిలిచాడు. శుక్రవారం ప్రాక్టీస్ సందర్భంగా రసెల్ కారు ప్రమాదానికి గురవగా... దాని నుంచి వెంటనే తేరుకున్న మెర్సిడెస్ డ్రైవర్ క్వాలిఫయింగ్ రేసులో వాయువేగంతో దూసుకెళ్లాడు. రసెల్ 1 నిమిషం 29.158 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్ర స్థానం దక్కించుకున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ 1 నిమిషం 29.340 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జోరు కొనసాగిస్తున్న మెక్‌లారెన్ డ్రైవర్లు ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ ఈ క్వాలిఫయింగ్ రేసులో వెనుకబడిపోయారు. పియాస్ట్రి (1 నిమిషం 29.524 సెకన్లు) మూడో స్థానం దక్కించుకోగా... ఆంటొనెల్లి (1 నిమిషం 29.537 సెకన్లు; మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచాడు. నోరిస్ (1 నిమిషం 29.586 సెకన్లు) ఐదో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 1 నిమిషం 29.688 సెకన్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును రసెల్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు.