ఏజెంట్ల మోసాలను అరికట్టడంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థకే ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు
సౌదీ అరేబియా, గ్రీస్, సింగపూర్‌లలోని కంపెనీల్లో ఉద్యోగాలు
మోర్తాడ్(బాల్కొండ): విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) శుభవార్త అందించింది. ఏజెంట్ల మోసాలను అరికట్టడంలో భాగంగా విదేశాల్లోని కంపెనీలకు, వలస కార్మి మకులకు ప్రభుత్వరంగ సంస్థనే మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గతంలో కేవలం గల్ఫ్ దేశాల వీసాలను ఇప్పించిన టామ్‌కామ్ కొన్ని నెలల నుంచి పాశ్చాత్య దేశాల్లోనూ యువతకు ఉపాధి బాటలు వేస్తోంది. ఇజ్రాయెల్, జర్మనీ వీసాల జారీతో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిన టామ్‌కామ్ తాజాగా సౌదీ అరేబియా, గ్రీస్, సింగపూర్ దేశాల్లో ఉపాధి చూపనుంది. ఆసక్తి ఉన్నవారు టామ్‌కామ్‌ను సంప్రదిస్తే అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
సౌదీ అరేబియాలో వేర్‌హౌజ్‌లలో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్ చదివిన అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్‌కు సంబంధించి బేసిక్ నాలెడ్జి ఉండాలని టామ్‌కామ్ సూచించింది. 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులకు వేర్‌హౌజ్‌లలో ఉపాధి కల్పించనున్నారు. మన కరెన్సీలో రూ.40 వేల వేతనం ఉచిత వసతి, రవాణా సదుపాయం కూడా కంపెనీనే కల్పిస్తుంది. అభ్యర్థులకు ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టు తప్పనిసరి అనే నిబంధన ఉంది.
గ్రీస్‌లో ఉపాధి పొందాలనుకునే మహిళలకు హౌస్‌కీపింగ్, బార్ అండ్ రెస్టారెంట్‌లలో వెయిటర్‌లుగా పనిచేయడానికి యువతీ యువకులకు అవకాశం ఉంది. మన కరెన్సీలో రూ.1.02 లక్షల వేతనం వస్తుంది. అభ్యర్థుల వయస్సు 18–45 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మగవారికైతే ఎల్రక్టీషియన్, కార్పెంటర్, ప్లంబర్, టైల్స్, మార్బుల్ మేషన్‌లకు ఉపాధి కల్పిస్తారు. వీరికి కూడా వేతనం రూ.1.02 లక్షల వరకు ఉంది. గార్డెనింగ్, క్లీనర్‌లుగా పని చేసేవారికి రూ.88 వేల వరకు వేతనం చెల్లిస్తారు. గ్రీస్‌లో కార్మిక చట్టాలను అనుసరించి ఓవర్‌టైం పని కల్పించనున్నారు.
చదవండి: చింటూని వదలొద్దు! నేను లిఖిత చచ్చిపోతున్నాం
సింగపూర్‌లో ప్లాస్టర్ మేషన్, స్టీల్ ఫిక్సర్ రంగాల్లో కూడా ఉపాధి కల్పిస్తారు. ఆయా రంగాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు 45 ఏళ్ల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని టామ్‌కామ్ వెల్లడించింది. మన కరెన్సీలో రూ.29 వేల నుంచి రూ.31 వేల వేతనం చెల్లిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు టామ్‌కామ్ ఈమెయిల్‌కు వివరాలను పంపించాల్సి ఉంటుంది. టామ్‌కామ్ కార్యాలయమున్న ఐటీఐ మల్లెపల్లి హైదరాబాద్ క్యాంపస్‌లో స్వయంగా 94400 50951/49861/51452 నంబర్లలో సంప్రదించవచ్చని జనరల్ మేనేజర్ నాగభారతి వెల్లడించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ టామ్‌కామ్ ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో ఎలాంటి మోసానికి తావు ఇవ్వకుండా వీసాల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment