జార్ఖండ్‌ సర్కార్‌ను కూల్చే కుట్ర: రాహుల్‌ | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ సర్కార్‌ను కూల్చే కుట్ర: రాహుల్‌

Published Sat, Feb 3 2024 5:59 AM

BJP tried to destabilise Jharkhand govt - Sakshi

పాకూర్‌(జార్ఖండ్‌): హేమంత్‌ సోరెన్‌ను అక్రమంగా జైలుకు పంపి జార్ఖండ్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ కుట్ర పన్నిందని, ప్రజాతీర్పుకు భంగం కల్గకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జార్ఖండ్‌లోకి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా పాకూర్‌ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు.

‘‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాతీర్పును బీజేపీ పరిహసించాలని చూసింది. మేం దానిని అడ్డుకున్నాం. ధనం, దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ చెలరేగుతోంది’’అని రాహుల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు తాను కట్టుబడిఉంటానన్నారు. ‘‘ అస్సాంలో యాత్రకు అడ్డుపడిన సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో పార్టీ మారిన మిలింద్‌ దేవ్‌రా వంటి నేతలతో పార్టీకి పనిలేదు’’ అని రాహుల్‌ అన్నారు.

నకిలీ రాహుల్‌ ఆచూకీ దొరికింది: హిమంత
మరోవైపు, అస్సాంలో న్యాయ్‌యాత్ర వేళ బస్సులో రాహుల్‌ స్థానంలో కూర్చుని అభివాదం చేస్తున్న నకిలీ రాహుల్‌ ఆచూకీ తామ గుర్తించామని హిమంత చెప్పారు. ‘‘ అస్సాంలో మోదీ పర్యటన ముగిశాక పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మరో రాహుల్‌ వివరాలు బహిర్గతం చేస్తా. జనానికి చేతులు ఊపుతూ, యాత్ర బస్సులో ఉన్నది రాహుల్‌ కాదు’’ అని హిమంత అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement