PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా? | Sakshi
Sakshi News home page

PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?

Published Tue, May 7 2024 1:18 PM

will chiranjeevi campaign really helps pawan kalyan

ఇంతోటి బతుకు ఇక్కడికి వచ్చిందా?

పిఠాపురం పవన్ కోసం చిరు వినతి 

గజ ఈతగాడు అన్నారు.. ఆకాశాన్నంటే హైప్ క్రియేట్ చేశారు... మనోడు లేస్తే పరశురాముడు గండ్ర గొడ్డలి తీస్తే హరిహరాదులు కూడా అడ్డుకోలేరు అన్నారు. అయన మౌనంగా కూర్చుంటే వశిష్ఠుడు అన్నారు.. ఒంటి చేత్తో కూటమి ముంగిటకు అధికారాన్ని తెచ్చి పడేసాడు అన్నారు. అన్న కన్నెర్ర చేస్తే భూమ్యాకాశములు ఏకమవుతాయన్నారు. పిడికిలి బిగించి గుద్దితే పిడుగులు కురుస్తాయి.. కన్నెర్ర చేస్తే నిప్పుల వాన..  ఆయన ప్రేమ ఆకాశం... ఆయన ఆగ్రహం అనంతం.. ఈ మాదిరి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్‌ను మోశారు. పాపం సినిమావాడు కదా.. నమ్మేసాడు.. సినిమాల్లో ఐతే స్క్రిప్ట్ ప్రకారం నచ్చినట్లు రాసుకోవచ్చు.. పిడికిలి బిగిస్తే భూమి బద్దలయ్యేలా గ్రాఫిక్స్ పెట్టొచ్చు.. ఒంటి చేత్తో లక్షలాదిమందికి శాసించొచ్చు ఎందుకంటే వాళ్లంతా జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి.. వింటారు.


స్టూడియోలో స్క్రిప్ట్ ప్రకారం అట్ట కత్తులు తిప్పి పదులసంఖ్యలో శతృవులను కూల్చడం వేరు.. నిజంగా సమాజంలో నిలబడి.. ప్రజల మద్దతు పొందడం వేరు.. తన సినీగ్లామర్ చూసి జనం వస్తారు అంతవరకూ నిజమే కానీ వాళ్ళను ఆకట్టుకోవడం.. తన వ్యక్తిత్వం.. వ్యవహారశైలితోబాటు క్యారెక్టర్.. ఇవన్నీ చూసిగానీ ప్రజలు తనవెంట నడవరు. ప్రజలు.. సమాజం.. ఏమీ గమనించనట్లే ఉంటారు. కానీ అవకాశం వచ్చినపుడు నాయకులూ వేసే ప్రతి అడుగునూ ఆచితూచి చూసి అప్పుడు కానీ అనుసరించరు.. తన వెంట నడవరు.. పార్ట్ టైం నాయకుడైన పవన్‌కు ఇప్పుడు ఆ విషయం అర్థమైంది. 

జగన్‌ను, వైసీపీ నేతలను గుడ్డలూడదీసి కొడతాను.. సంకెళ్లు వేస్తాను.. ఇలాంటి డైలాగ్స్ పవన్ మానసిక సంతులితను తెలియజేస్తున్నాయి. దానికితోడు పిఠాపురంలో పవన్ మీద పోటీలో ఉన్న వంగా గీత తక్కువైనవ్యక్తి కాదు.. ముప్పయ్యేళ్లుగా ప్రజల్లో ఉంటూ ఎక్కడా మచ్చపడకుండా ప్రజల మద్దతుపొందుతూ వస్తున్నారు. గతంలో రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌కు ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగిడాలని కోరిక బలపడింది. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా మొదట ఉన్నంత సానుకూలత కనిపించడం లేదు. ఆదుకుంటాడు అనుకున్న వర్మ చివరలో పోటు పొందితే అంతకుమించిన అవమానం మరోటి ఉండదు. జబర్దస్త్ నటులతో చేయించిన ప్రచారం ప్రజలను నవ్వించింది.. పవన్‌ను నవ్వులపాల్జేసింది.. తప్ప ఓట్లు తెచ్చేది లేదని తేలిపోయింది.

ఆఖరి అస్త్రంగా మెగాస్టార్
పవన్ వద్ద ఉన్న డైలాగ్స్ .. యాక్షన్ సీన్లు అన్నీ ముగిసాక కూడా గెలుపు మీద నమ్మకం రాలేదు.. అటు గీత.. ఒక మహిళగా ప్రతి ఇంటినీ టచ్ చేస్తూ.. మీ ఇంటి ఆడబిడ్డను.. గెలిచినా గెలవకున్నా నా నివాసం ఇక్కడే.. కానీ వాళ్ళు గెలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం కోసం హైదరాబాద్.. మద్రాస్.. షూటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి అని చెబుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. దీంతో పవన్ పరిస్థితి చిల్లుకుండలోని నీళ్లు మాదిరి మారింది.

పూటపూటకూ గ్రాఫ్ తగ్గిపోతోంది.. దీంతో చివరి అస్త్రంగా మెగాస్టార్ చిరంజీవిని దించారు.. అయన కూడా తమ్ముడి గుణగణాలు.. వీరగాధలను ఉదహరిస్తూ పాపం పిల్లడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. గెలిపించండి... ఈసారైనా గెలిపించండి.. లేకుంటే అవమానభారంతో చచ్చేలా ఉన్నాడు అని విజ్ఞప్తి చేశారు. ఆఖరుకు పవన్ పరిస్థితి అక్కడికి వచ్చింది.. చంద్రబాబును సీఎంను చేయగలిగిన చరిష్మా ఉందని భావిస్తున్న పవన్.. ఇప్పుడు అన్నతో వీడియో పోస్ట్ చేయించుకునే స్థితికి చేరారు.. ఇది దాదాపుగా ఓటమితో సమానం... గెలిచినా ఓడినట్లే..

:::: సిమ్మాదిరప్పన్న

Advertisement
 
Advertisement
 
Advertisement