
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్ర, రాష్ట్రాలను హైకోర్టు గతంలోనే అడిగి తెలుసుకుంది. ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, తామే తీసుకుంటామని హైకోర్టు తేల్చిచెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్‌ఐఏ విచారణకు అంగీకరించింది.
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో అక్టోబర్ 25న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పక్కనే ఉన్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రక్షణశాఖకు చెందిన తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్రం మొదలు అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్‌పోర్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్) ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటన జరిగిన మరుక్షణం నుంచే కేసును నిర్వీర్యం చేసేందుకు, పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు మొదలు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడారు. వైఎస్ జగన్‌పై సానుభూతి కోసమే శ్రీనివాసరావు దాడి చేశాడని ఏకపక్షంగా ప్రకటనలు చేశారు. ఏదో చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు యత్నించారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాన్ని కోరింది. డిసెంబర్ 31న ఈకేసును ఎన్‌ఐఏకి బదిలీ చేసినట్టు ఏపీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. హోం శాఖ ఆదేశాలతో హైదరాబాద్ ఎన్‌ఐఏ విభాగం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ప్రధాన విచారణ అధికారిగా మహ్మద్ సాజిద్ ఖాన్‌ను నియమించారు.