
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రేషన్ కార్డుల కోసం 2.34,941 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో స్ప్లిట్ కార్టులకు సంబంధించి 1,43,672 దరఖాస్తులు ఉండటం గమనార్హం. అన్‌లైన్‌లో ఆర్‌టీజీఏ సాఫ్ట్‌వేర్ ద్వారా దరఖాస్తులను వెరిఫికేషన్ చేశారు. దీని ద్వారా జిల్లాలో 28,022 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. ఈ ఏడాది నిర్వహించిన జన్మభూమి సభల్లో కొత్త రేషన్ కార్డులతోపాటు, ఒక కుటుంబంలోని వారు విడిపోయి వేరుగా నివాసం ఉంటూ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి (స్లి్పట్) కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్ కార్డుల నుంచి.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు తొలగించింది. తర్వాత వారి మొర ఆలకించలేదు.
జన్మభూమి సభలో కేవలం కొత్త రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం కూడా జన్మభూమిలో రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోని తీసుకొని తాజాగా మంజూరు చేశారు. స్లి్పట్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకపోవటంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయడం వల్ల అదనంగా భారం పడుతుందనే ఉద్దేశంతో.. ఉమ్మడి కుటుంబాలను విడదీయొద్దంటూ ప్రభుత్వం కొత్త పాట అందుకొంది. స్లి్పట్ కార్డులు ఇచ్చి ఉంటే సంక్రాంతికి చంద్రన్న కానుకల కోసమే రూ. 6.37 కోట్లు వెచ్చించాల్సి ఉండేదని అధికారులు చెబుతున్నారు.
ప్రజాసాధికారిక సర్వేలోనమోదైతేనే..
రేషన్ కార్డు మంజూరు కోసం ప్రభుత్వం రకరకాల నిబంధనలు పెడుతోంది. ప్రజా సాధికారిక సర్వేలో పేరు నమోదైతేనే రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారు. సర్వే సమయంలో కొంత మంది ఉద్యోగులు యాప్‌ను సరిగా ఉపయోగించకపోవటంతో తప్పులు దొర్లాయి. కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్నప్పుడు ప్రజా సాధికారిక సర్వేలో అప్‌డేట్ కాకపోతే కొత్త కార్డు రావటం లేదు.
సవాలక్ష నిబంధనలతో..
ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 28,022 కార్డులను మంజూరు చేసింది. జన్మభూమిలో రేషన్ కార్డులో అర్జీలు ఇచ్చి, నోడల్ ఆఫీసర్ డేటా ఎన్‌రోల్ చేసిన దరఖాస్తులను మాత్రమే కొత్త కార్డుల మంజూరులో పరిగణనలోకి తీసుకొంది. ఈ దరఖాస్తులో ఇచ్చిన పూర్తి సమాచారాన్ని వారంలోపు తహసీల్దార్‌లు అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం రెవెన్యూ సిబ్బంది ఈపీడీఎస్ డేటాలో కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్లకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. వారంలోపు వివరాలు అప్‌లోడ్ కాకపోతే మంజూరైన రేషన్ కార్డు రద్దవుతుందని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 20వ తేదీలోపు కొత్త కార్డులను ప్రింట్ చేస్తామని, 21వ తేదీ నుంచి మే 30వ తేదీలోపు కార్డుల పంపిణీ చేపడతామని అధికారులు వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి కొత్త కార్డులకు రేషన్ ఇస్తామన్నారు.
ఈ నెల 30వ తేదీలోగాకొత్త కార్డుల పంపిణీ
ప్రభుత్వం జిల్లాకు 28 వేల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. వెంటనే తహసీల్దార్ల ద్వారా ఈపీడీఎస్ డేటాలో కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్లకు సంబంధించి ఫ్యామిలీ ఫొటో అప్‌లోడ్ చేయిస్తున్నాం. కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు మే 30వ తేదీలోపు అందజేస్తాం. జూన్ 1వ తేదీ నుంచి కొత్త కార్డుదారులకు రేషన్ వస్తుంది.-చిట్టిబాబు, డీఎస్‌వో, గుంటూరు